Alien Attack: నవంబరులో గ్రహాంతర జీవుల దాడి?
- AP Teachers TV
- Sep 3
- 2 min read

Aliens Attack in November
ఓ రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తోంది. దాని వెడల్పు 10-20 కిలోమీటర్లు కాగా వేగం సెకండుకు 60 కిలోమీటర్లు. అది మామూలు అంతరిక్ష వస్తువైతే పెద్దగా ఆలోచించేవారు కాదేమో. మహా అయితే ఎక్కడో ఓ చోట ఢీకొట్టొచ్చు. లేదూ భూమిని చేరుకునే క్రమంలో ఆకాశంలోనే మండిపోవచ్చు. కానీ అది గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావొచ్చని ఓ తాజా అధ్యయనం పేర్కొంటోంది. భూమి మీద దాడి చేసే ప్రమాదముందనీ హెచ్చరింస్తోది. అదీ వచ్చే నవంబరులోనే!
గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావొచ్చని భావిస్తున్న అంతరిక్ష వస్తువు పేరు 3ఐ/అట్లాస్. ఇంతకుముందు దీన్ని ఏ11పీఎల్3జడ్‌గా పిలుచుకునేవారు. ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరిజ్ఞానం అయ్యిండొచ్చని, మన భూమి మీద హఠాత్తుగా దాడి చేయొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ హెచ్చరిక చేసినవారిలో ప్రముఖ ఖగోళభౌతిక శాస్త్రవేత్త ఎవీ లోయెబ్ కూడా ఉండటం ఆలోచింప జేస్తోంది. గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోవటానికి ఆయన చాలాకాలంగా కృషి చేస్తున్నారు. ఇతర నక్షత్ర మండలం నుంచి 2017లో దూసుకొచ్చిన ‘ఒవుమువామువా’ అనే అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన కృత్రిమ పరికరం కావొచ్చనే అనుమానం వ్యక్తం చేసింది ఆయనే మరి.
అదృశ్యంగా.. హఠాత్తుగా
ఒకవేళ 3ఐ/అట్లాస్ తెలివైన గ్రహాంతర నౌక అయినట్టయితే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చని గుర్తించారు. దాని కక్ష్యను బట్టి ఈ అంచనాకు వచ్చారు. ఇది నవంబరు చివర్లో సూర్యుడికి దగ్గరగా రావొచ్చని భావిస్తున్నారు. సూర్యుడికి ఎంత దగ్గరకు వస్తే అంత ఎక్కువగా మనకు కనిపించే అవకాశం తగ్గుతుంది. అంటే అది రహస్యంగా అతి వేగంగా దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట. చిలీలోని రియో హర్టాడో వద్ద నెలకొల్పిన ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (అట్లాస్) సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించింది.
నిజంగానే దాడి చేస్తుందా?
ఇప్పటికైతే 3ఐ/అట్లాస్ దాడి చేయొచ్చనేది ఊహా సిద్ధాంతమే. కచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేమని అధ్యయనం చెబుతోంది. అయినప్పటికీ ఇది గమనించ దగ్గ నివేదిక, విశ్లేషణే అని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని సూచిస్తున్నారు. అయితే మన రక్షణ చర్యలు ఫలితం చూపకపోవచ్చనీ అంచనా వేస్తుండటమూ గమనార్హం.
మనకు గ్రహాంతర టెక్నాలజీ అవసరమా?
ఇక్కడ నేల, వనరుల కోసం కొట్లాడుతున్న మానజాతికి 3ఐ/అట్లాస్ మేలుకొలుపు కాగలదనీ ఎవీ లోయెబ్ అంటున్నారు. దీంతో ముంచుకొస్తున్న ఉమ్మడి ముప్పును ఎదుర్కోవటానికి ప్రపంచ నేతలు ఏకం కావాలనీ పిలుపు ఇచ్చారు. గ్రహాంతర జీవులు తమ సాధనాలతో భూమిని, ఇతర గ్రహాలను చేరినట్టయితే మన ప్రాధాన్యాలు సమూలంగా మారిపోతాయన్నది ఆయన భావన. మానవులు ప్రాంతీయ సంక్షోభాలను పక్కనపెట్టి భూమికి ఆవలి నుంచి రానున్న ముప్పులను అన్వేషించక తప్పదని చెబుతున్నారు.












Comments