top of page

AP Mega DSC: డీఎస్సీకి అప్లయ్ చేసేటప్పుడే పోస్టులు సెలెక్ట్ చేసుకోడానికి ఆప్షన్లు




మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

అర్హత ధ్రువపత్రాల అప్‌లోడ్‌ తప్పనిసరి

గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు! 

ఆన్‌లైన్‌ పరీక్ష.. అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు

పీడీ, పీఈటీలకు టెట్‌ లేదు..ద్విభాషల్లో ప్రశ్నపత్రాలు

మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. తుది గడువు మే 15

AP Mega DSC

AP Mega DSC 2025

మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా రెండు విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్‌ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్‌ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్‌లు ఇస్తారు.

మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్‌టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకూ అవకాశం ఉండదు. 

అభ్యర్థులు ముందుగానే అన్నీ సరిచూసుకుని, దరఖాస్తులు సమర్పించాలి. 

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు కొనసాగుతుంది.

  • మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి.

  • మే 30 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు

వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు సమర్పించొచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టుకు కాకుండా ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 

  • అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతోపాటు దరఖాస్తును తిరస్కరిస్తారు.  

  • అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని జులై ఒకటో తేదీ నాటికి 44ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 49ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54ఏళ్లుగా నిర్ణయించారు. 

  • ప్రత్యేక విద్య బీఈడీ కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలల్లోని పోస్టులకు అర్హత కలిగి, పోస్టుకు ఎంపికైతే వారికి ఆరు నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 

  • ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్‌ను అమలు చేశారు. క్రీడల కోటా వారికి మూడు శాతం రిజర్వేషన్‌ కల్పించారు.    

  • ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకడమిక్స్, ఆంగ్ల భాష నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు.


ఆన్‌లైన్‌ పరీక్షలో నార్మలైజేషన్‌ విధానం

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(ఆన్‌లైన్‌) ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

  • ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 6 నుంచి జులై 6 వరకు ఉంటాయి. డీఎస్సీకి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం, తగ్గించడం జరుగుతుంది.

  • అభ్యర్థుల సంఖ్య పెరిగి, పరీక్ష కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు. 

  • ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడతకు 300 నుంచి 500మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయి.

  • ఆన్‌లైన్‌ పరీక్ష కొన్ని రోజులపాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్లను కలిపి ఈఏపీసెట్, జేఈఈల్లో అమలుచేస్తున్నట్లు నార్మలైజేషన్‌ విధానాన్ని పాటిస్తారు. 

  • పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతోపాటు పదోతరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్‌లో రెండోభాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతోపాటు మరో భాషలో ప్రశ్నపత్రం ఉంటుంది. 

  • ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతోపాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది. పీడీ, పీఈటీలకు ఆంగ్లంతోపాటు తెలుగులోనూ ప్రశ్నపత్రం ఇస్తారు.


వారికి టెట్‌ అవసరం లేదు..

  • ఫిజికల్‌ డైరెక్టర్, వ్యాయామ విద్య టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు. వంద మార్కులకు రెండు వందల ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. 

  • ప్రిన్సిపాళ్లు, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ) నాన్‌ లాంగ్వేజెస్‌ వారికి పేపర్‌-1 ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఇస్తారు.

  • ప్రిన్సిపాళ్లు, పీజీటీలకు టెట్‌ ఉండదు. టీజీటీ, పీజీటీ నాన్‌ లాంగ్వేజెస్, ప్రిన్సిపాళ్ల పోస్టులకు దరఖాస్తు చేసినవారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్‌ వంద మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపాల్‌ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పని చేసిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. 

  • టీజీటీలో రెండో పేపర్‌ 80మార్కులకు ఉంటుంది. టెట్‌కు 20మార్కుల వెయిటేజీ ఉంటుంది.


అప్రెంటిస్‌షిప్‌ విధానం రద్దు 

వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తీసుకొచ్చిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ-2024లో అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండేళ్లపాటు వెట్టిచాకిరి చేసేలా దీన్ని పొందుపర్చింది. ప్రత్యేక జీఓ జారీ చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరిల్లోని బేసిక్‌లో 50%, రెండో ఏడాది 60% గౌరవవేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేయాలనే అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు అప్పట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ రాసే అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తొలగించి, ఆ వెట్టిచాకిరి నుంచి ఉపశమనం కల్పించింది



 
 
 

Comments


bottom of page