AP RTE Lottery Results: ఆర్టీఈ కింద ప్రైవేటు స్కూల్స్‌లో ఉచిత అడ్మిషన్లు.. రెండో విడత లాటరీ ఫలితాలొచ్చాయ్
- AP Teachers TV
- Jun 20
- 1 min read
ఏపీలో విద్యాహక్కు చట్టం 12(1) ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో విద్యా హక్కు చట్టం 12(1) ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. రెండో విడతలో ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను విడుదల చేసినట్లు ససమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు వెల్లడించారు. రెండో రౌండ్‌లో 8,583 మందికి సీట్లు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణ పత్రాలతో జూన్ 26 నుంచి 28వ తేదీలోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చని సూచించారు. మరోవైపు, ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు.ఈ జాబితా కాసేపట్లో https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చని సూచించారు.
అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు తప్పవ్..!
ఒకటో తరగతిలో ప్రవేశాలకు మే 2 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. మొత్తం 37,427 మంది పిల్లలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడత కింద 28,561 మంది అర్హత సాధించారు. వీరిలో తొలి విడత లాటరీలో 23,118 మందికి సీట్లు కేటాయించగా.. 15,541 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని శ్రీనివాసరావు ఆదేశించారు. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు(APC)లకు ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ల ద్వారా నిర్ధారిస్తారని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే ఎంఈవో, డీఈవో, ఆర్జేడీలను సంప్రదించాలని ఆయన సూచించారు.












Comments