Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ కీలక నిర్ణయం
- AP Teachers TV
- Mar 21
- 1 min read

అమెరికా విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా ఇటీవల విద్యాశాఖ (Education Department)లోని ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యాశాఖనే మూసివేశారు. గురువారం ఈ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. ‘అతి త్వరలోనే దీన్ని అమలుచేస్తాం. విద్యాశాఖ ద్వారా మాకు ఎలాంటి మేలు జరగదు. ఈ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగివ్వాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామన్నారు. ఇక, ఈ చర్యను డెమోక్రట్లు తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ తీసుకున్న అత్యంత విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటిగా వారు పేర్కొన్నారు.
ఇక, విద్యాశాఖ అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ తెలిపారు. అదే సమయంలో దేశ ప్రజలకు అందుతోన్న సేవల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు.
అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. దానిలోభాగంగా ఆ శాఖలోని (Education Department) సిబ్బందిలో సగం మందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నామని గతంలోనే ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మాన్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు. ‘‘ట్రంప్ నాకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేసేందుకు మేం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించి ఉన్నవారిపై కత్తెరవేయడం కిందికే వస్తుంది’’ అని లిండా ఇటీవల పేర్కొన్నారు. విద్యాశాఖను తొలగించి, దానిని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెప్పారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీవిరమణ చేయడానికి ముందుకొచ్చారు.












Comments