EPFO: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పీఎఫ్ వడ్డీ 8.25 శాతమే!
- AP Teachers TV
- Feb 13
- 1 min read
EPFO: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో నిల్వలపై పాత వడ్డీ రేటే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి గానూ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈపీఎఫ్‌ఓ ప్రకటన ఉండనుంది. సీబీటీ (CBT) సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నాక అందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వడ్డీ రేటు. ఈ ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఇప్పటివరకు 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. దీని విలువ రూ.2.05 లక్షల కోట్లు. 2023- 24లో మొత్తంగా రూ.1.82 లక్షల కోట్లు విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించించినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది.












Comments