Guillain Barre Syndrome: ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం
- AP Teachers TV
- Feb 16
- 2 min read

Guillain Barre Syndrome: ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం
అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్)తో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న కమలమ్మ అనే మహిళ మరణించింది.
రెండు రోజుల కిత్రం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మకు ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చు పడిపోయాయి.
ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. కమలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వ్యాధి సోకి మరణించిన తొలి మహిళ కమలమ్మ మరణించడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు సదరు గ్రామంలో ప్రజలకు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. కానీ ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో టెన్షన్ పడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణలో ప్రవేశించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటరయింది. . ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బార్రే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
అయితే గుంటూరు జిల్లా జీజీహెచ్‌కు ఈ వ్యాధి సొకిన బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో వారికి ఐసీఐలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..
ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతోపాటు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదని పేర్కొంటున్నారు.












Comments