top of page

How to become rich : ధనవంతులు అవ్వాలంటే.. ఈ అలవాట్లు ఉండాల్సిందే!

How to become rich: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైరైపోయి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనే కాన్సెప్ట్‌ విదేశాల్లో విస్తరిస్తోంది. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆ దిశగా యువత అడుగులు వేస్తోంది. మరి ఎర్లీగా రిటైర్‌ అవ్వాలంటే..?


How to become rich
How to become rich

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైరైపోయి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనే కాన్సెప్ట్‌ విదేశాల్లో విస్తరిస్తోంది. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆ దిశగా యువత అడుగులు వేస్తోంది. అయితే, ఎర్లీగా రిటైర్‌ అవ్వాలంటే.. అంతకుముందే ఎక్కువ మొత్తంలో డబ్బును మూటగట్టుకోవాలి కదా! సరైన నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ, కచ్చిత ప్రణాళిక ఉంటేనే అది సాధ్యమంటూ.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.. చిన్న వయసులోనే పెద్ద మొత్తం పోగేయండి మరి!  

పొదుపునకు పక్కనబెట్టాకే..

‘ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది.. పొదుపు గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే మొత్తం ఖర్చు చేసేయడమే..!’- చాలామంది యువత ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ, అది సరైనది కాదని నిపుణుల మాట. కొలువు వచ్చిన దగ్గర్నుంచే పొదుపు, పెట్టుబడుల నిమిత్తం కొంత పక్కనబెట్టాకే.. మిగిలింది ఖర్చులకు వాడుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్‌లో అదే అలవాటుగా మారుతుంది. 

బడ్జెట్‌కు కట్టుబడాలి..

ఆర్థిక విజయానికి బడ్జెట్‌నే దిక్సూచీగా చెబుతుంటారు. అందుకే ముందుగా మన అవసరాలపై మనకు స్పష్టత ఉండాలి. ఆదాయం, వ్యయాల ఆధారంగా ఇంటి బడ్జెట్‌ని వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకుమించి ఖర్చు చేయకూడదనే నియమం పెట్టుకోవాలి. నెలాఖరున ఖర్చులను ఒకసారి పరిశీలిస్తే.. ఎక్కడ ఆదా చేయవచ్చో మనకో అవగాహన వస్తుంది. మరుసటి నెల నుంచి ఆ మిగిలిన మొత్తాన్నీ పొదుపులోకి మళ్లించొచ్చు.  

త్వరగా.. క్రమంతప్పకుండా..

‘అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరం ఏముంది?’ అని అనుకోకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొదుపును ప్రారంభించాలి. ఇప్పుడది చిన్నమొత్తమే అయినా దీర్ఘకాలంలో ఎక్కువ జమ అవుతుంది. సొమ్మంతా ఒకే దగ్గర కాకుండా, వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. 

రుణాల జోలికిపోకండి

సాధ్యమైనంత వరకు రుణాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ మరీ అవసరమైతే.. అంతా పరిశీలించాకే ఎక్కడ తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడే తీసుకోవాలి. ఒకవేళ మీరు సంపాదించే నాటికే రుణాలేమైనా ఉంటే.. వాటిల్లో ముందుగా ఎక్కువ వడ్డీ చెల్లించేది తీర్చేయండి. 



తక్కువలోనే జీవించండి

ఆదా చేయడమే మన ఏకైక లక్ష్యం అయినప్పుడు.. ఇతరులతో పోల్చుకొని హంగులకు పోకుండా, అనవసరమైనవి కొనకుండా సాధారణ జీవితాన్నే అలవాటుగా చేసుకోవాలి.  స్థోమత ఉన్నా అంతకంటే తక్కువలో బతికితేనే స్వల్ప కాలంలో అధిక మొత్తం పోగేయగలం.  

అత్యవసర నిధిని సమకూర్చుకోండి

ఎప్పుడు ఏ అవసరం ఎటునుంచి వస్తుందో తెలియని రోజులివి. అందుకే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. ఉద్యోగులైతే కచ్చితంగా ఆరు నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోమని చెబుతుంటారు. అనుకోని ప్రమాదం, అనారోగ్యం, జాబ్‌పోవడం, కారు రిపేర్‌ వంటి ఆపద సమయాల్లో ఆ మొత్తం ఆదుకుంటుందన్నమాట. మన ఇళ్లల్లో అమ్మలు పోపులపెట్టెలో దాచిన కొంచెం డబ్బే.. కష్టకాలంలో మనకు బంగారు నిధిలా కనిపిస్తుంది కదా.. అలాగన్నమాట.  

పన్నుల భారం పడకుండా..

సంపాదించడం ఒకెత్తయితే.. పన్నుల భారం పడకుండా చూసుకోవడం అంతకుమించిన ఎత్తు. అందుకే, ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదిస్తూ.. ట్యాక్స్‌ నుంచి మినహాయింపు పొందే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవద్దు. 

తప్పు లేదు.. బేరమాడండి

కొందరు చిన్నవాటికీ బేరమాడుతుంటారు. మరికొందరేమో దాన్ని నామోషీలా భావిస్తుంటారు. కానీ, అది సరికాదు. మన చేతి నుంచి డబ్బు ఇచ్చే అంశం ఏదైనా.. సాధ్యమైనంత బేరం ఆడితేనే ఎంతోకొంత మిగుల్చుకోవచ్చు. పక్కనోళ్లు ఏమనుకుంటారోననే బిడియాలన్నీ వదిలితేనే మన లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకోగలం. 

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి.. 

నిత్యం ఏదో ఒక కొత్త అంశం నేర్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. మార్కెట్‌కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమో, ఉన్నదానికి మెరుగులు దిద్దుకోవడమో చేసుకుంటూ అదనపు ఆదాయంపై దృష్టిసారించాలి. కాలానుగుణంగా ఆర్థిక ప్రణాళికలో వస్తున్న మార్పులను గమనిస్తూ.. అందుకు తగినట్లు మన వ్యూహాలు అమలుచేయాలి. 

చివరిగా.. ధనవంతులు కావడమనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని చాలామంది యువత భావన. అందులోంచి బయటకొచ్చి.. ఆర్థిక అలవాట్లే సంపద సృష్టికి సోపానాలని గుర్తెరిగితే, అనుకున్న దానికంటే ముందే కోటీశ్వరులు కావొచ్చు. ఎర్లీగా రిటైర్మెంట్‌ తీసుకొని నచ్చినట్లు హాయిగా బతకొచ్చు.




 
 
 

Comments


bottom of page