Microsoft: ఏఐ వ్యవస్థలు రూపొందించి.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయిన మైక్రోసాఫ్ట్ సిబ్బంది!
- AP Teachers TV
- May 23
- 1 min read
Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పుడు వాటివల్లే తమ ఉపాధిని కోల్పోయారు.

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) తన సిబ్బందిలో మూడు శాతం మందికి ఇటీవల ఉద్వాసన పలికింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమమేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయి. అయితే, ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి (Microsoft layoffs).
వాషింగ్టన్ ఆఫీసులో తొలగించిన 40శాతం ఉద్యోగుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఎక్కువగా ఉన్నారు. ఏఐ సాధనాల వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో వారు పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు. ఆ వ్యవస్థలతోనే ఇప్పుడు వారి ఉద్యోగాలను సంస్థ భర్తీ చేయడం గమనార్హం. 50శాతం మేర కోడ్ రాసేందుకు ఓపెన్ ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించుకోవాలని తన ఆధ్వర్యంలో ఉన్న 400 మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి జెఫ్ హల్స్ కొన్ని వారాల క్రితం సూచించారు. తాజా తొలగింపుల్లో ఆ బృందం కూడా ఉంది. అంటే వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకు వారే ఎసరు తెచ్చుకున్నట్లయింది.జూనియర్ కోడర్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్నవారు, ఏఐ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సిబ్బంది ఈ కొత్త లేఆఫ్‌ను ఎదుర్కొన్నారు. చివరకు మైక్రోసాఫ్ట్ స్టార్టప్‌లకు చెందిన ఏఐ డైరెక్టర్ గాబ్రియెలా డికీరోజ్ కూడా తన పదవిని కోల్పోవడం గమనార్హం. దీనిపై ఆమె స్పందిస్తూ.. చేదు రుచి కలిగిన తీపి ఇది అని పేర్కొన్నారు. సంస్థ కోసం ఎంతో కృషి చేసినవారు తమ ఉద్యోగాలను కోల్పోవడం విచారకమని వ్యాఖ్యానించారు.
2023లో 10 వేల మందికి మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్వాసన పలికింది. అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. ‘‘మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూనే ఉంటాం’’ అని ఈ లేఆఫ్‌లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు.గత నెల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కృత్రిమ మేధ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్‌ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యల అనంతరమే 3 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది.












Comments