top of page

passive income ideas: పనిచేయకున్నా... ‘పాసివ్‌’ ఆదాయం!


passive income ideas: పనిచేయకున్నా... ‘పాసివ్‌’ ఆదాయం!
passive income ideas: పనిచేయకున్నా... ‘పాసివ్‌’ ఆదాయం!

ఉద్యోగం లేకపోయినా జీతం రావాలా? వ్యాపారం చేయకపోయినా లాభాలు కావాలా? అయితే, ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’ గురించి ఆలోచించండి. అలా అని, ఇదేం అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం కాదు... పక్కా ఆర్థిక ప్రణాళిక. సంపదనూ, సంపాదననూ సృష్టించే దీర్ఘకాలిక వ్యూహం.


అవును! రేపటి అవసరాల కోసమైనా, రెండుచేతులా సంపాదించాలి. రెండు చేతులకూ సంపాదించడం నేర్పాలి. ఒక చేయి... జీతం కోసం. మరో చేయి... జీవితం కోసం. మొదటి చేయి విశ్రాంతి తీసుకున్నా, రెండో చేయి అందుకోవాలి. ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది. చేయకపోతే రాదు. కొన్నిసార్లు, మార్కెట్‌ సంక్షోభం కారణంగా ఉన్న కొలువూ ఊడిపోవచ్చు. ఒత్తిడిని భరించలేకో, పోటీని తట్టుకోలేకో మనమే ఆ పరుగు నుంచి పక్కకి తప్పుకోనూవచ్చు. ఆ పరిస్థితే వస్తే కష్టాల్లో పడతాం. అందులోనూ, మధ్యతరగతి జీవితాలకు... జీతం ఒకటే అయినా, బాధ్యతలు అనేకం. గృహరుణం వాయిదా చెల్లించాలి. కారు అప్పు తీర్చేయాలి. పర్సనల్‌ లోన్‌ బకాయి వదిలించుకోవాలి. అదనంగా పిల్లల చదువులూ, పెద్దల బాధ్యతలూ ఉండనే ఉంటాయి. మరి జీవితం సంగతి? ఏదో ఒక రోజు స్టార్టప్‌ ఆరంభించాలనేది జీవితాశయం. ఎప్పటికైనా ఐఎస్‌బీలో ఎంబీఏ చేయాలనేది కాలేజీ రోజులనాటి కల. టార్గెట్లూ డెడ్‌లైన్లతో నిమిత్తం లేకుండా నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలనేది బలమైన ఆకాంక్ష. ఇందులో ఏ ఒక్కటి నిజం కావాలన్నా... ఉద్యోగం లేకపోయినా, నెలనెలా జీతం మాత్రం అందాలి. 


‘పాసివ్‌ ఇన్‌కమ్‌’తోనే ఇదంతా సాధ్యం.



పాసివ్‌ ఇన్‌కమ్‌ను... పరోక్ష ఆదాయమనీ, నిష్క్రియా సంపాదన అనీ పిలుస్తారు. కొన్ని మొక్కలకు రోజూ నీళ్లు పెట్టాలి. బలానికి ఎరువులు వేయాలి. పురుగూపుట్రా ఆశించకుండా క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి. ఇదంతా, ఉద్యోగాన్ని తలపించే చాకిరీ. మరికొన్ని మొక్కల్ని మాత్రం నాటి వదిలేస్తే సరిపోతుంది. వాటంతట అవే పెరిగిపోతాయి. ఏడాదికో, ఆర్నెల్లకో పంటనూ ఇచ్చేస్తాయి. ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’ కూడా ఇలాంటిదే. ఇది డబ్బుకు డబ్బును కాయించే కరెన్సీ సేద్యం. ప్రతి రోజూ, ప్రతి గంటా పనిచేయం. అలా అని, పూర్తిగా గాలికి వదిలేయం. పెట్టుబడుల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉంటాం. నెలవారీ ఆదాయాన్ని ఠంచనుగా అందుకుంటాం. జీతం ఆగిపోయినా, తగ్గిపోయినా, సరిపోకపోయినా భయపడాల్సిన పనుండదు. ‘నిద్రలోనూ సంపాదించే రహస్యం తెలియకపోతే, శాశ్వత నిద్రలోకి జారిపోయేవరకూ పనిచేయాల్సి వస్తుంది జాగ్రత్త!’ అని హెచ్చరిస్తాడు విశ్వ కుబేరుడు వారెన్‌ బఫెట్‌. పాసివ్‌ ఇన్‌కమ్‌ అచ్చంగా అలాంటి ‘ఎర్న్‌ వైల్‌ యు స్లీప్‌’ చిట్కానే! మన అవసరాలూ, ఆర్థిక లక్ష్యాలూ, కెరీర్‌ ప్రణాళికలను బట్టి పరోక్ష సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొందరు, తదుపరి నెల నుంచే రాబడిని ఆశిస్తారు. కొందరు, దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంటారు. కొందరు, జీతానికి అదనంగానో, పెన్షన్‌కు ప్రత్యామ్నాయంగానో ఏర్పాటు చేసుకోవాలని  అనుకుంటారు. అందుకు తగినట్టు వ్యూహాలూ రచించుకుంటారు. అలా అని, ఒక్కసారి పాసివ్‌ ఇన్‌కమ్‌ను సిద్ధం చేసుకుంటే... జీవితాంతం నిశ్చింతగా బతికేయగలమని అనుకుంటే పొరపాటే. ఆ సంపాదనకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. రాబడిలో ఏటా పది శాతమైనా పెరుగుదల కనిపించాలి. అందులోనూ, ఆరోగ్య బీమా లాంటి ముఖ్య విషయాల్లో ప్రస్తుత ఖర్చులతో పోల్చుకోకూడదు. జీవన ప్రమాణాలు పెరుగుతూ, ఆయుర్దాయాలు అధికం అవుతున్నందున... పాతిక ముప్పై ఏళ్ల తర్వాతి పరిస్థితుల్నీ దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య వ్యయాలు ఏటా పదిహేను నుంచి ఇరవై శాతం మేర పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆ లెక్కల ప్రకారమే మన ఆరోగ్య బీమా విలువను సవరించుకోవాలి. టర్మ్‌ పాలసీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అరకొర బీమా రక్షణ చిల్లుల గొడుగు లాంటిది. ఉన్నా లేనట్టే.


గుడ్లుపెట్టే ఆస్తులు...

ఆస్తులు రెండు రకాలు. ఒకటి... విలువ పెరిగేవి. రెండు... విలువ పెరుగుతూనే, తక్షణ రాబడిని అందించేవి. ఓమోస్తరు నగరంలో రెండొందల గజాల స్థలం తీసుకున్నా, దీర్ఘకాలంలో ఆ విలువ తప్పక పెరుగుతుంది. అదే ఇల్లు అయితే... అటు ఆస్తి విలువ పెరుగుతుంది. ఇటు అద్దె కూడా వస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచించి, ఏ దుకాణమో కొనగలిగితే... ప్రతినెలా ఫస్టున మరింత పెద్ద మొత్తం చేతికి అందుతుంది. పొలమైనా ఫర్వాలేదు. పంటల సీజన్‌లో కౌలు రూపంలో కొంత డబ్బు జమ అవుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా, నెలనెలా స్థిరమైన సంపాదన అందుకోవాలని అనుకునేవారు... రెండో మార్గంలో నడవడమే ఉత్తమం. మొదటి దారిని ఎంచుకున్నవారు, పాసివ్‌ ఇన్‌కమ్‌ అవసరమైన సమయానికి స్థిరాస్తుల్ని కరిగించి... స్థిరమైన నెలవారీ సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

passiv∈income
Passive Income

‘ఇన్‌స్టంట్‌’ ఆదాయం

దీర్ఘకాలిక ప్రణాళికతోనే, పాసివ్‌ ఇన్‌కమ్‌కు అవసరమైన వనరుల్ని సృష్టించుకోగలం. తమకంటూ కొన్ని లక్ష్యాలూ, కలలూ ఉన్నవారు... తొలి జీతం అందుకున్న రోజే, ఆ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది. పదేళ్లు, పదిహేనేళ్లు, పాతికేళ్లు... కాల వ్యవధి పెరిగేకొద్దీ నికర సంపదా పెరుగుతుంది. మరింత స్థిరమైన రాబడి లభిస్తుంది. నెలనెలా ఎంత మొత్తం అందుకోవాలనే విషయంలో ముందే ఓ అంచనాకు రావాలి. అందుకు తగినట్టుగానే పొదుపు-మదుపు కేటాయింపులు జరపాలి. ‘అయినా, ఎప్పటి వరకో ఎదురుచూడటం ఎందుకు? తక్షణమే రెండో సంపాదనను సృష్టించుకోలేమా?’ అనుకునే వ్యక్తులూ ఉంటారు. అలాంటి వారు తమకంటూ ఓ సొంతిల్లు ఉంటే, అందులో ఒకట్రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చుకోవచ్చు. చాలామంది, ఇల్లాలు ముచ్చటపడిందనో పిల్లలు పోరుతున్నారనో అవసరం ఉన్నా లేకపోయినా కారు కొనేస్తుంటారు. కొత్త మోజు తీరిపోయాక... ఆ బండి పార్కింగ్‌కే పరిమితమై పోతుంది. ఆ వాహనాన్ని అద్దెకిస్తే... నెలనెలా ఆదాయం వస్తుంది! సిక్స్‌ప్యాక్‌ ట్రెండ్‌ మే ఎండలా మండిపోతున్న రోజుల్లో ఈఎమ్‌ఐ మీద కొనుక్కున్న ట్రెడ్‌మిల్, స్మార్ట్‌ బైక్‌ లాంటి జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ బాల్కనీలో ఓ మూలన పడుంటాయి. వాటిని ఆన్‌లైన్‌ వేదికలపైన అద్దెకిచ్చుకోవచ్చు. సేవింగ్స్‌ ఖాతాలో వృథాగా ఉన్న మిగులు సొమ్మును ఆకర్షణీయమైన వడ్డీని అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలకు మళ్లించుకోవచ్చు. ఇవన్నీ, చిన్నపాటి సర్దుబాట్లతో తక్షణమే రెండో ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలు.  ఈ ప్రణాళికను కనుక కచ్చితంగా అమలు చేస్తే ఇంటి అద్దె, కారు అద్దె, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైన వడ్డీ... ఇలా వివిధ రూపాల్లో ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’ మన పర్సులో పడిపోతుంది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకోడానికి నిపుణుల సాయంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నిస్తే, పరోక్ష ఆదాయం మరో రెండు రూపాల్లోనూ వస్తుంది. డబ్బును ఇన్వెస్ట్‌ చేయడం ఒక దారీ, కాలాన్నీ నైపుణ్యాన్నీ పెట్టుబడిగా పెట్టడం ఇంకో దారి.

డబ్బు ప్లస్‌ నైపుణ్యం



మనం మార్కెట్‌ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా అంగడి సరుకే. వస్తువు, సేవ, నైపుణ్యం... అన్నీ అమ్ముకోవచ్చు. కాకపోతే, మనకు మనం ప్రచారం చేసుకోవాలి. మనలోని కళకు బ్రాండ్‌ విలువ సృష్టించాలి. ఆకట్టుకునేలా రాయగలిగితే, అక్షరాలూ అదనపు ఆదాయ మార్గాలు అవుతాయి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌ పైనా పట్టు ఉన్నవారికి ప్రచురణ సంస్థలు అనువాదకులుగా అవకాశం ఇస్తున్నాయి. మంచి పారితోషికాన్నీ అందిస్తున్నాయి. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ ట్యూటర్‌ అవతారం ఎత్తొచ్చు. నృత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ...ఇలా ఏ అభిరుచినైనా ఆదాయంగా తీర్చిదిద్దుకోవచ్చు. రియల్‌ ఎస్టేట్, బీమా రంగాల్లో మార్కెటింగ్‌ మాంత్రికుడు అయిపోవచ్చు. సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్‌ ఛానెల్‌ ఓనర్, యోగా గురు, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌... అవతారమూ ఎత్తొచ్చు. ఇవన్నీ పాసివ్‌ ఇన్‌కమ్‌ పరిధిలోకే వస్తాయి. అభిరుచితో ముడిపడిన ఆదాయానికి పరిమితి ఉండదు, రిటైర్మెంటు ఉండదు. ఆ పనిలో మనకు అలసటా తెలియదు. కాకపోతే, మన నైపుణ్యానికి నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీనీ, కొత్తతరం అభిరుచినీ అందిపుచ్చుకోవాలి. మనసుకు ముసలితనం రాకుండా జాగ్రత్తపడాలి. ఈ ఆదాయం తక్షణ అవసరాలకు పాసివ్‌ ఇన్‌కమ్‌గా పనికొస్తుంది. రేపటి పాసివ్‌ ఇన్‌కమ్‌కు పెట్టుబడిగానూ ఉపయోగపడుతుంది.

స్టాక్‌ మార్కెట్‌ అంటేనే రిస్క్‌తో సహజీవనం. ట్రంప్‌ తుమ్మితే పడిపోవచ్చు. నిర్మలమ్మ నవ్వితే మళ్లీ లేచి కూర్చోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా, దలాల్‌ స్ట్రీట్‌ను పాసివ్‌ ఇన్‌కమ్‌ మార్గంగా ఎంచుకునేవారికి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) కొంత సురక్షితమైన మార్గం. క్రమానుగత పెట్టుబడి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఫార్ములా - 15్ల15్ల15 ప్రకారం... పదిహేనేళ్లపాటూ నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెడితే... పదిహేను శాతం రాబడితో, పదహారో ఏడాది ఆ విలువ దాదాపు కోటి రూపాయలకు చేరుతుందని అంచనా. ఆ సొమ్మును ఏదైనా డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితమైన ‘పాసివ్‌’ పద్ధతి. ఉదాహరణకు... ఒక్కొక్కటి వంద రూపాయల చొప్పున, కోటి రూపాయలతో లక్ష యూనిట్లు కొనుగోలు చేశామని అనుకుందాం. నెలనెలా యాభైవేల రూపాయల విలువైన యూనిట్లను సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (స్విప్‌) కింద నగదు రూపంలో ఉపసంహరించుకుంటే... ముప్పై ఏళ్లపాటూ నిశ్చింతగా స్థిరమైన రాబడిని అందుకున్నాక కూడా... సుమారు రూ.1.76 కోట్ల కార్పస్‌ అందుబాటులో ఉంటుందని నిపుణుల అంచనా. మ్యూచువల్‌ ఫండ్‌ నెట్‌ అసెట్‌ వాల్యూ (ఎన్‌ఏవీ)లో పెరుగుదలతో ఇదంతా సాధ్యం అవుతుంది. స్థిరమైన రాబడి కోసం ఏటా డివిడెండ్లను అందించే పెద్ద కంపెనీల షేర్లనూ ఎంచుకోవచ్చు. నగదు ప్రవాహం అధికంగా ఉన్న లాభదాయక సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వాటాదారులకు లాభాలను పంచుతాయి. కోల్‌ ఇండియా, ఐటీసీ, ఓఎన్‌జీసీ మొదలైనవి ఆ జాబితాలోకి వస్తాయి. ఆ మొత్తం చిన్నదే అయినా, ఆదాయం స్థిరమైంది. మరో వైపున, మార్కెట్‌కు అనుగుణంగా షేర్ల విలువా పైపైకి పాకుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో సంపద తరగదూ, ఆదాయం ఆగదూ!



ఇతర మార్గాలూ...

బంగారాన్ని దేవుడి కరెన్సీగా అభివర్ణిస్తారు ‘రిచ్‌డాడ్‌ - పూర్‌డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకీ. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కొద్దిపాటి ఒడుదొడుకులు ఉంటాయే తప్పించి, బంగారం ధర మరీ పతనమైపోయిన దాఖలాల్లేవు. ‘సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఢోకా లేదు’ అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ ఈ మధ్యే ప్రకటించారు కూడా. ఇరవై ఏళ్ల క్రితం బంగారంపైన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే... ఇప్పుడు, తక్కువలో తక్కువ పన్నెండున్నర లక్షలు అందుకునేవాళ్లం. భవిష్యత్తులోనూ  ఇదే హవా కొనసాగుతుందని అంచనా. స్థిరమైన ఆదాయం కావాలనుకునే సమయానికి ఆ పెట్టుబడిని కరిగించి ఏ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గానో మార్చుకోవచ్చు. నేరుగా రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే... రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ లాంటి వేదికలు పాసివ్‌ ఇన్‌కమ్‌కు సరికొత్త వేదికలు అవుతున్నాయి. కాకపోతే, ఈ పెట్టుబడి విధానం మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆరేడు శాతానికి మించి రాబడిని ఇవ్వకపోవచ్చు కానీ, యాన్యుటీ ప్లాన్స్‌నూ తీసిపారేయలేం. పాసివ్‌ ఇన్‌కమ్‌లో రోజువారీ శ్రమ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఎప్పటికప్పుడు మార్కెట్‌ కదలికల్ని గమనించుకుంటూ ఉండాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. తేడా వస్తే, సంపద కరిగిపోతుంది. నెలవారీ సంపాదన బక్కచిక్కి పోతుంది. కాకపోతే ఒక షరతు... మీ పాసివ్‌ ఇన్‌కమ్‌ మీద అయినా, దాంతో ముడిపడిన పెట్టుబడుల మీద అయినా... మీకూ, మీ జీవిత భాగస్వామికి మాత్రమే నియంత్రణ ఉండాలి. మరొక్క సూచన. పూర్తిగా పాసివ్‌ ఇన్‌కమ్‌ మీదే ఆధారపడేవారికి, ప్లాన్‌-బి తప్పనిసరి. ఏ కారణం వల్ల అయినా, ఒకట్రెండు ఆదాయ మార్గాలు మూసుకుపోతే, తక్షణ సర్దుబాటు కోసం అదనపు నిధులనూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదొక సుదీర్ఘ ఆర్థిక ప్రయాణం. మార్కెట్లో కుదుపులు ఉంటాయి. అయినా, తట్టుకోవాలి. ఓపిక, ఆశావాదం... పాసివ్‌ ఇన్‌కమ్‌కు ఆర్థికేతర పెట్టుబడులు.

*

ఉద్యోగంలో ఉంటే... కలల్ని నిజం చేసుకోలేం. ఉద్యోగం వదిలేస్తే... వాస్తవ ప్రపంచంలో బతకలేం. కాబట్టి, మధ్యేమార్గమే ఉత్తమం. ఉద్యోగం చేస్తూనే కలల్ని నిజం చేసుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. మేనేజ్‌మెంట్‌ పట్టా అందుకోడానికి లక్షణమైన కొలువును వదులుకోవాల్సిన పన్లేదు. ఆన్‌లైన్‌లో కోర్సు పూర్తి చేయొచ్చు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకుని, అభిరుచులకూ కొంత సమయం కేటాయించు కోవచ్చు. ఇక స్టార్టప్‌ కల అంటారా? కొన్ని సంస్థలు ఇంట్రాప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహిస్తున్నాయి. మనం పనిచేస్తున్న కంపెనీ భాగస్వామ్యంలోనే కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? అంతిమంగా ఒకటే సూచన... ప్లే సేఫ్‌!

బాగా ఆలోచించాకే...



రెండో సంపాదనను కోరుకోవడం, ఉద్యోగ జీవితం నుంచి విముక్తిని ఆశించడం దురాశ కాదు. కానీ, ఆ వైపుగా అడుగులు వేసే ముందు, తక్షణ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

1. మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ఉందా? మెడికల్‌ ఎమర్జెన్సీలో ఆ మొత్తం సరిపోతుందా?

2. ఇంటి పెద్దగా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాల్సిన బాధ్యతా మీదే. ఏదైనా జరిగితే, మీరు లేకపోయినా కూడా... వాళ్లకు ఏ లోటూ రాకుండా భారీ మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకున్నారా?

3. గృహరుణం ఇంకా తీర్చాల్సి ఉందా? పెద్దపెద్ద అప్పులేమైనా ఉన్నాయా?

4. మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనైనా, తట్టుకుని నిలబడేంత శక్తి మీకుందా?

5. హఠాత్తుగా ఆదాయం ఆగిపోయినా, కనీసం ఆరునెలల పాటూ ఇల్లు గడవడానికి ‘అత్యవసర నిధి’ ఏర్పాటు చేసుకున్నారా?

6. రెండో సంపాదన దారికి వచ్చేలోపు, మొదటి సంపాదన ఆగిపోతే ఏం చేస్తారు? మీ దగ్గర ప్లాన్‌-బి ఉందా?

7. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యాలు ఉన్నాయా?

8. మీ జీవిత భాగస్వామి కూడా సంపాదనాపరులేనా?

9. పిల్లల చదువులకు డబ్బు సిద్ధం చేసుకున్నారా?


... ఇందులో మిమ్మల్ని మీరు అడిగే, ప్రతి ప్రశ్నా కీలకమైందే. మీకు మీరు ఇచ్చుకునే ప్రతి జవాబూ ముఖ్యమైందే. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలే. అన్ని కోణాల నుంచీ ఆలోచించుకున్నాకే అడుగు ముందుకేయాలి.

ప్రతి పద్దూ ప్రత్యేకమే!

రేపటి ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’కు... నేటి ‘యాక్టివ్‌ ఇన్‌కమ్‌’ బలమైన పునాది. వీలైనన్ని నిధులు సమీకరించుకోవాలి. ప్రతి పద్దుకూ  స్థిరమైన ఆదాయవనరు ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు... కిరాణా సామాన్లకు నెలకు రూ.పదివేల వరకూ అవసరమైతే, ఆ మొత్తం బ్యాంకు వడ్డీ రూపంలో అందేలా కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఔషధాలు, పాల బిల్లు, పేపర్‌ బిల్లు, కేబుల్‌ బిల్లు, రవాణా ఖర్చులు... ఇలా ఇతర అవసరాలకు ఓ పాతిక వేలు తప్పనిసరి అనుకుందాం. సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా ఆ సొమ్ము చేతికి అందేలా జాగ్రత్తపడాలి. టర్మ్‌ పాలసీ, ఆరోగ్య బీమా, వార్షిక వైద్య పరీక్షలు... ఇలా దేని పద్దు దానిదే. పర్యటనల కోసం, చిన్నాచితకా బహుమతుల కోసం కూడా ఓ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల, డబ్బు కోసం తడుము కోవాల్సిన అవసరం రాదు. అలా అని మూలధనాన్ని కదిలించకూడదు. మొత్తం సొమ్మును ఒకే రంగం మీద ఇన్వెస్ట్‌ చేయకుండా... పొదుపు-మదుపులో ఎంతోకొంత వైవిధ్యాన్ని పాటించాలి.  


ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌.. రిటైర్‌ ఎర్లీ (ఫైర్‌) - నవతరం  ఆర్థిక స్వేచ్ఛా మంత్రం. మన రిటైర్మెంట్‌ వయసును ఎవరో ఎందుకు నిర్ణయించాలి? మనమేఓ తీర్మానానికి వచ్చేద్దాం. నాలుగు పదుల్లో ఉద్యోగ విరమణ చేస్తే పోలా?... అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇదంతా కాలి మీద కాలేసుకుని కూర్చోడానికి కాదు! కలల్ని నిజం చేసుకోడానికి. స్టార్టప్‌ను ప్రారంభించడం, విదేశాల్లో చదువుకోవడం, సరికొత్త కెరీర్‌ను నిర్మించుకోవడం... ‘ఫైర్‌’ ప్రధాన లక్ష్యాలు అవుతున్నాయి. అందుకు అవసరమైన పెద్ద మొత్తం సమకూరే వరకూ... హంగూ ఆర్భాటాల్లేకుండా బతికేస్తారు. పెద్దపెద్ద అప్పుల జోలికి వెళ్లరు. కమిట్‌మెంట్స్‌ పెట్టుకోరు. వార్షిక వ్యయాలకు ఇరవై అయిదు రెట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకోవడం, ఆ ఏడాది ఏర్పడిన లోటును మరుసటి ఏడాదిలోపు ఏదో ఓ రూపంలో భర్తీ చేసుకోవడం... ఈ రెండు నిర్ణయాలూ ‘ఫైర్‌’లో చాలా కీలకం. ఆ ప్రయోగంలో చేతులు కాల్చుకుని మళ్లీ కార్పొరేట్‌ పౌరసత్వం తీసుకున్నవారు ఉన్నారు, కంపెనీలు స్థాపించి ఘన విజయాలు సాధిస్తున్నవారూ ఉన్నారు




 
 
 

Comments


bottom of page