top of page

Satellite internet: స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌

స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది.

ప్రత్యేక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదు

స్టార్‌లింక్‌ సేవలతో పోలిస్తే భిన్నం

ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో వొడాఫోన్‌ఐడియా భాగస్వామ్యం

AST Space Mobile - satellete mobile phone services

దిల్లీ: స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు పోటీ సంస్థే ఏఎస్‌టీ. అంతరిక్ష ఆధారిత సెల్యులార్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను తీసుకొస్తున్న తొలి, ఏకైక కంపెనీ ఇదే. వాణిజ్య సేవలు, ప్రభుత్వ అప్లికేషన్ల కోసం ఈ నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా వివరించింది. ‘భారత్‌లో మొబైల్‌ అనుసంధానం లేని ప్రాంతాల్లో విస్తరించడం కోసం ఇరు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. అంతరిక్షాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత మొబైల్‌ ఫోన్లలోనే వాయిస్, వీడియో కాల్‌ సేవలు అందించడం ద్వారా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చరిత్ర సృష్టించింద’ని వెల్లడించింది. 

విప్లవాత్మక సాంకేతికత ఇది: ‘అదనంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ లేదా పరికరాల సహకారం లేదా అప్‌డేట్‌ల అవసరం లేకుండానే, స్మార్ట్‌ఫోన్లకు నేరుగా స్పేస్‌ ఆధారిత సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను అందించే వీలును ఏఎస్‌టీ, వొడాఫోన్‌ఐడియా భాగస్వామ్యం కల్పిస్తోంది. వొడాఫోన్‌కున్న దేశీయ నెట్‌వర్క్, ఏఎస్‌టీకున్న విప్లవాత్మక సాంకేతికత ఒక దగ్గరికి వచ్చింద’ని పేర్కొంది. 

అంతరిక్షం నుంచే 4జీ, 5జీ సేవలు: ‘మా అంతరిక్ష ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఎలా పనిచేస్తుందో నిరూపించడానికి భారత్‌ వంటి విస్తృత, చురుకైన టెలికాం మార్కెట్‌ సరైన ఎంపిక అవుతుంది. మా కవరేజీని విస్తృతం చేయడంతో పాటు, కనెక్టివిటీకి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచే 4జీ, 5జీ  సేవలు అందిస్తామ’ని ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ ఐవరీ పేర్కొన్నారు. 

స్టార్‌లింక్‌ ఇస్తుంది కానీ..: మనదేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు  టెలికాం విభాగం (డాట్‌) లైసెన్సు మంజూరు చేసింది. అయితే స్టార్‌లింక్‌ సేవలు పొందాలనుకునేవారు ప్రత్యేకంగా పరికరాలను కొనాల్సి ఉంటుంది. స్టార్‌లింక్‌తో అంబానీకి చెందిన జియో, సునీల్‌ మిత్తల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు కంపెనీలకు మనదేశ టెలికాం విపణిలో 70 శాతానికి పైగా వాటా ఉంది. ఏఎస్‌టీ నెట్‌వర్క్‌ మాత్రం ప్రత్యేక పరికరాలు లేకుండానే, నేరుగా 4జీ, 5జీ సేవలను మొబైల్‌కు అందిస్తామంటోంది.


ఈ సేవలను ఎపుడు ప్రారంభించేదీ వొడాఫోన్‌ ఐడియా వెల్లడించలేదు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధి ‘సరైన సమయంలో సమాచారం ఇస్తామ’ని మాత్రమే తెలిపారు. వొడాఫోన్‌ ఐడియా ప్రమోటరు సంస్థ వొడాఫోన్‌ పీఎల్‌సీ ఇప్పటికే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది.


 
 
 

Comments


bottom of page