top of page

Scrub Typhus: ‘స్క్రబ్‌ టైఫస్‌’తో జాగ్రత్త

ree

రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి పాజిటివ్‌ కేసులు..చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం


రాష్ట్రంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. స్క్రబ్‌ టైఫస్‌ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్‌ టైఫస్‌ వస్తుంది. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణసమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్‌ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు (ఏఆర్‌డీఎస్‌), మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు (మెనింజైటిస్‌), మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.


ఎక్కడ ఎలా..

ఈ బ్యాక్టీరియా బారిన పడినవారిలో ఎక్కువగా చిత్తూరు (379), కాకినాడ (141), విశాఖపట్నం (123) జిల్లాల వారు ఉన్నారు. ఇంకా.. వైఎస్సార్‌ కడప (94), శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు (86), అనంతపురం (68), తిరుపతి (64), విజయనగరం (59), కర్నూలు (42), అనకాపల్లి (41), శ్రీకాకుళం (34), అన్నమయ్య (32), గుంటూరు (31), నంద్యాల (30) జిల్లాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడినవారికి సాధారణ యాంటీబయాటిక్స్‌తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. కానీ అవగాహన లేక, సకాలంలో గుర్తించలేకపోవడంతో సమస్య వస్తోంది. జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా, టైఫాయిడ్, డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.


పరీక్షలు చేరువైతే.. 

స్క్రబ్‌ టైఫస్‌ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు 6-30% వరకు నమోదు కావొచ్చు. రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండడం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడంలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్‌లలో అనుమానిత పరీక్షలు చేస్తున్నారు. ఇవికాక పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లు 17 జిల్లాల్లోనే ఉన్నాయి. అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో.. నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేస్తే ఫలితం ఉంటుంది.  


ఈ ఆరు నెలలు జాగ్రత్త

స్క్రబ్‌ టైఫస్‌ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

  • తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగుచేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి చేతులున్న చొక్కా, ప్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరించాలి.

  • ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని మార్చాలి. లేదంటే శుభ్రం చేశాకే వాడాలి.

  • పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరుబయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.

రాష్ట్రంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ తీవ్రత ఇలా.. (జనవరి 1 నుంచి నవంబర్‌ 26 వరకు)

అనుమానిత కేసులకు పరీక్షలు: 6,678గుర్తించిన పాజిటివ్‌ కేసులు : 1,317




 
 
 

Comments


bottom of page