top of page

Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు!


Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు!

Supreme Court: పోక్సో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అరుదైన తీర్పు ఇచ్చింది.

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పోక్సో కేసు (POCSO Case) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. అందుకు ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితే కారణమని వ్యాఖ్యానించింది. కేసు పూర్వపరాలివీ..


బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ట్రయల్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానిని సవాల్‌ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దానిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. 2023 అక్టోబరు 18న సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది.


‘‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’’ అని సూచించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్‌ పిటిషన్‌గా స్వీకరించింది. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలుకు దాఖలు చేసింది. దాంతో ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది.



అయితే, బాధితురాలు.. అతడిని పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించాలని సూచించింది.   ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కోర్టు విధించిన గడువులో నిపుణుల కమిటీ నివేదిక సీల్డ్ కవర్‌లో అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 3న ధర్మాసనం బాధితురాలితో మాట్లాడింది. ఆమె పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత ఆమెకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది.


ఈ కేసులో తాజాగా తుది తీర్పు వెలువరించింది. ‘‘ప్రస్తుతం ఆమె మేజర్‌. చట్టప్రకారం ఆ ఘటనను నేరంగానే చూస్తున్నప్పటికీ.. ఆమె దానిని అలా చూడటం లేదు. ఆ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ.. కొన్ని ఇబ్బందికర పరిణామాలను మాత్రం ఎదుర్కొంది’’ అని పేర్కొంది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులు మరీ ముఖ్యంగా దోషి, ప్రస్తుత కుటుంబ జీవితంలో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ఆమెకు పూర్తి న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని చెప్పింది. దాంతో పోక్సో కేసులో దోషికి ఏ శిక్షా విధించకుండా తీర్పు ఇచ్చింది.



 
 
 

Comments


bottom of page