top of page

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులు.. యూజీసీ అనుమతి


హైదరాబాద్‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకడమిక్‌ రంగాల్లో డిమాండ్‌ ఉందని తెలిపారు. యూజీసీ ఆమోదం తెలిపిన కొత్త కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్‌, ఎంఏ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌), మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (MSW), ఎమ్మెస్సీ జాగ్రఫీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ) ఉన్నట్లు వివరించారు. 

యూజీసీ నిపుణుల కమిటీ జూన్‌లో వర్చువల్‌గా తనిఖీ చేసిందని.. వర్సిటీలోని మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, ఇతర అన్ని అంశాలను పరిశీలించి ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ అనుమతులు రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉందన్నారు. విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా టీచర్లకు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్‌ ద్వారా ప్రత్యేక ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ అందించాలనే ఉద్దేశంతో కోర్సుల్ని రూపొందించగా.. యూజీసీ వాటికి ఆమోదం తెలిపిందన్నారు. ఈ కోర్సులకు ఆమోదం పొందిన నేపథ్యంలో యోగితా రాణా, యూజీసీకి చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కొత్త కోర్సులు అభ్యసించేందుకు కనీస విద్యార్హతలు, అడ్మిషన్‌ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్లు తదితర వివరాలతో వర్సిటీ త్వరలోనే అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇస్తుందని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం తమ వర్సిటీ వెబ్‌సైట్లు http://braou.ac.in, http://braouonline.inను సందర్శించవచ్చని సూచించారు.

 
 
 

Comments


bottom of page