టెన్త్, ఇంటర్‌లో ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు ప్రదానం Money Prizes to SSC and Intermediate Toppers
- AP Teachers TV
- May 7
- 1 min read
ఏపీలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. Money prizes to SSC and Intermediate Toppers

అమరావతి: ఏపీలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల నుంచి ఆయా విభాగాల వారీగా రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.20 వేలు, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15 వేలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఇచ్చారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత శాఖల మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
కష్టపడితే ఎవరైనా ఉన్నత శిఖరాల్ని చేరొచ్చు: మంత్రి డోలా
సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రతిభ ఎవరి సొంతమూ కాదన్న ఆయన.. కష్టపడితే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
ప్రభుత్వం సిలబస్ తగ్గించి గుణాత్మక విద్యను అందించాలని సంకల్పించిందని డోలా అన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్ని మరమ్మతులు చేసేందుకు, ఆధునీకరించేందుకు సీఎం చంద్రబాబు రూ.143 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఎక్స్‌లెన్సీ కేంద్రాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10కి పెంచుతామని తెలిపారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో శత శాతం వచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. అక్టోబరు నుంచి కాకుండా జులై, ఆగస్టు నుంచే ట్యూటర్లను పెడతామని చెప్పారు. విద్యార్థులకు త్వరలో కాస్మోటిక్స్ కిట్స్ ఇవ్వబోతున్నామని, వంట సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు. నూతన విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్లకు, పాఠశాలలకు ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇవ్వబోతోందన్నారు. అనంతరం మహిళా, శిశుసంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో గురుకులాలను ఎన్టీఆర్ ప్రవేశపెడితే.. వాటిని చంద్రబాబు పూర్తిగా ఆధునీకరించారన్నారు.












Comments