త్వరలో ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి’
- AP Teachers TV
- 3 days ago
- 1 min read

విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు
బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు
ఈబీసీ, కాపులకు రూ.15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు
అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద రూ.5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా పేరు పెట్టనున్నారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా..
2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం అంబేడ్కర్, ఎన్టీఆర్ పేర్ల మీద ఈ పథకాన్ని అమలు చేయగా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడాలేని నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేసింది. పథకానికి ఉన్న అంబేడ్కర్, ఎన్టీఆర్ పేర్లను తొలగించి జగనన్న పేరు పెట్టింది. ఆర్థికసాయం పెంచినట్టే చూపించి విద్యార్థుల సంఖ్య పెరగకుండా నిబంధనలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పథక లబ్ధి అందకుండా చేసింది. సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్-50 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే సాయం అందేలా నిబంధన తెచ్చింది. ఇది ఆయా వర్గాల విద్యార్థులకు శరాఘాతంగా మారింది. తాజాగా అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా క్యూఎస్ ర్యాంకింగ్‌నే ప్రాతిపదికగా తీసుకుంటున్నా, టాప్-250 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థికసాయం అందించేలా నివేదించారు.
Comments