top of page

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 : లోకేష్

2 minutes ago
2 min read

నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు చర్యలు

పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా 'మిషన్ మార్చ్' అమలు చేయండి

డ్రాప్ అవుట్స్‌పై సింగపూర్ మంత్రి షణ్ముగం సూచనను పరిగణనలోకి తీసుకోండి

ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖలో ప్రతిష్టాత్మక గ్రంథాలయ నిర్మాణం

విద్యాశాఖ అధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమీక్ష


ఏపీ టీచర్స్ టీవీ ,అమరావతి: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని అన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రిక్రూట్ మెంట్ మోడల్‌ను ఆసక్తిగా గమనిస్తోంది, మనం అనుసరిస్తున్న విధానాలనే ఇతర రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా 'మిషన్ మార్చ్' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.


బడి మానేసే (స్కూల్ డ్రాపౌట్) పిల్లలు భవిష్యత్తులో మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడటం, అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్నట్లు ఇటీవల తిరుపతి వచ్చిన సింగపూర్ హోం మంత్రి షణ్ముగం చెప్పారని, ఈ అంశాన్ని అధికారులంతా గమనంలోకి తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్స్ నివారణలో కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేసి 'జీరో డ్రాప్ అవుట్ మిషన్' చేపట్టాలని సూచించారు. యువత పెడదారి పట్టకుండా ఇప్పటికే 'డ్రగ్స్ వద్దు బ్రో' వంటి ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు స్కూల్ సందర్శనకు త్వరలో సింగపూర్ మంత్రి షణ్ముగంను ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కూళ్లను గుర్తించి, 'లీప్ స్కూల్స్'గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు - 2025 అమలు విధివిధానాలపై సమీక్షించారు.



రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పందిస్తూ... అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది, డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లుచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు జేఎస్ఎస్ యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, యూపీఈఎస్, జేయూఎస్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, సవిత యూనివర్సిటీ వంటివి ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని, త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.


రాష్ట్రంలో SALT (Supporting Andhra's Learning Transformation) ప్రోగ్రామ్ అమలుపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ.. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ నాటికి తొలివిడత పూర్తవుతున్న నేపథ్యంలో... మలివిడత కోసం సంప్రదించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు స్పందిస్తూ తొలివిడతగా 21 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కౌన్సిలర్లను గుర్తించామని చెప్పారు. ఆటిజం, భవిత సెంటర్లు సాధ్యమైనంత వరకు ఒకేచోట ఉండేలా సూచించారు. ఈ నెలాఖరుకు 14 సెంటర్ల సివిల్ కన్‌స్ట్రక్షన్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో విశాఖలో పబ్లిక్ లైబ్రరీ శాఖ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న గ్రంథాలయ నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు, ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి ఇంఛార్జ్ చైర్మన్ విజయభాస్కర్, రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 
 
 

Comments


bottom of page