‘పీఈటీ కొట్టాడు..’ సారీ మదర్.. ఐ విల్ డై టుడే
- AP Teachers TV
- Feb 23
- 1 min read

ఉప్పల్, న్యూస్‌టుడే: ఏదో తప్పు చేశాడని తరగతి గదిలోనే అందరి ముందు విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడు దండించాడు.. క్లాస్ టీచర్ కూడా తిట్టింది..దీంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని నోటుబుక్‌లో రాసి పెట్టి.. అదే పాఠశాల భవనంపై నుంచి దూకి 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. బోడుప్పల్‌లోని ద్వారకానగర్‌కు చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండో కుమారుడు సంగారెడ్డి(13). ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నాడు. శనివారం పాఠశాల పీఈటీ ఆంజనేయులు 8వ తరగతి గదికి వచ్చాడు. శుక్రవారం తరగతి గదిలోని సీసీ కెమెరా డైరెక్షన్ సంగారెడ్డి మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరి ముందు సంగారెడ్డిని కొట్టాడు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే ప్రిన్సిపల్‌కు చెప్పి, టీసీ ఇచ్చి పంపిస్తాన హెచ్చరించాడు. ఇదే సమయంలో క్లాస్ టీచర్ సంగారెడ్డిని హెచ్చరించినట్టు తెలిసింది.
అందరి ముందు అవమానమని..
తరగతి గదిలో పీఈటీ కొట్టడంతో సంగారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొద్ది సేపు తరగతి గదిలోనే దుఃఖించాడు. వాష్ రూంకు వెళ్తానని క్లాస్ టీచర్‌ను అడిగి బయటకు వెళ్లాడు. సంగారెడ్డి పక్కనే కూర్చొన్న మరో విద్యార్థి అతడు చివరగా రాసి పెట్టిన నోటుబుక్‌ను తీసి చూడగా ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసి ఉంది. వెంటనే క్లాస్ టీచర్‌కు ఇది చూపిస్తూ ఉన్నాడు. అప్పటికే సంగారెడ్డి పాఠశాల భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకేశాడు. పెద్దగా శబ్దం రావడంతో అంతా వచ్చి చూసేసరికే రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే దగ్గరలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లి సంగీత, మిగతా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఎంఈవో రామారావు పాఠశాలను సీజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Comments