top of page

పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యుళ్లు!



నకిలీ వార్తలు గుర్తించేందుకు ఏఐ సాయం

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి.

ఈ సందర్భంగా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్‌) సీఈఓ కె.అన్వర్‌సాదత్ మాట్లాడుతూ..‘ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి ఐదు, ఏడో తరగతి విద్యార్థుల ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఆన్‌లైన్‌ ‘ఫ్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టాం. గతంలో ఏర్పాటు చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. నకిలీ వార్తలు, హానికరమైన కంటెంట్‌ను గుర్తించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చదువుకునే దశలోనే నకిలీ సమాచారంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆరు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సహాయం తీసుకుంటున్నాం. ఏడో తరగతికి సంబంధించిన కొత్త ఐసీటీ పుస్తకంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకునే అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మలయాళం, ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.



2022లో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్‌) ‘డిజిటల్ మీడియా లిటరసీ కార్యక్రమం’ను చేపట్టింది. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 19.72 లక్షల మంది విద్యార్థులకు నకిలీ వార్తలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇందులో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంత భారీ శిక్షణ ఇవ్వడం దేశంలో అదే మొదటిసారి. ఈ ‍కార్యక్రమంలో 5920 మంది శిక్షకుల పాల్గొన్నారు. ‘సత్యమేవే జయతే’ పేరుతో 2.5 గంటలపాటు సాగిన ఈ శిక్షణలో ‘రోజువారీ జీవితంలో ఇంటర్నెట్‌ వినియోగం’, ‘సోషల్ మీడియా అవసరం’, ‘సోషల్ మీడియాలో హక్కులు-తప్పులు’ అనే నాలుగు విభాగాలపై దృష్టి సారించారు.



విద్యార్థి దశలో సమాచారాన్ని విపులంగా అర్థం చేసుకోవాలి. అందులో నకిలీ వివరాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంపొందించుకుంటే ‘క్రిటికల్‌ థింకింగ్‌’ వృద్ధి చెందుతుంది. దానివల్ల చదువుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో మేలు జరుగుతుంది. ఇది కేవలం నకిలీ వివరాలు గుర్తించడానికి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.



 
 
 

Comentários

Não foi possível carregar comentários
Parece que houve um problema técnico. Tente reconectar ou atualizar a página.
bottom of page