top of page

పోస్ట్ ద్వారా డెలివరీ కానివి.. ఎక్కడకు వెళ్తాయో తెలుసా..!

తపాలాశాఖ ఏం చేస్తుందంటే...


చిరునామా తప్పుగా రాసినా.. తీసుకునే వ్యక్తి లేకపోయినా పోస్టు ద్వారా పంపిన వస్తువులు ఎక్కడకు చేరతాయి? వాటిని ఏం చేస్తారు?

మరావతికి చెందిన సురేశ్‌ హైదరాబాద్‌లోని తన మిత్రుడు కిశోర్‌కు తపాలా ద్వారా ఓ పార్సిల్‌ను పంపించారు. తీరా కొన్ని రోజులకు తను రాసిన చిరునామా తప్పని గ్రహించిన సురేశ్‌ పార్సిళ్ల గురించి కిశోర్‌ను అడిగాడు. తాను ఊర్లో లేకపోవడంతో పార్సిల్‌ తీసుకోలేదని చెప్పి తర్వాత కొంత రుసుం చెల్లించి శాఖ కార్యాలయం నుంచి వస్తువులను తీసుకున్నాడు.


తరాలు మారినా తపాలా శాఖకు ఆదరణ తగ్గలేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాలానుగుణంగా అందులోనూ అనేక మార్పులు వచ్చాయి. ఇంకా ఇప్పటికీ అది అందించే సేవల గురించి చాలా మందికి పూర్తి అవగాహన లేదు. అందులో ఒకటే చిరునామా తప్పుగా రాసినా, సదరు వ్యక్తి అందుబాటులో లేకపోయినా అవి ఈ శాఖ వద్దే ఏడాది పాటు భద్రపరుస్తారు. అయితే ఇది కేవలం రిజిస్టర్డ్‌ పార్సిళ్లు, ఉత్తరాలకు మాత్రమే వర్తిస్తుంది.


ఏడు రోజుల వ్యవధిలో..

  • తపాలాశాఖ నుంచి సిబ్బంది వెళ్లి రిజిస్టర్డ్‌ ఉత్తరాలు, పార్సిళ్లను సదరు వ్యక్తికి చేరుస్తారు.

  • ఒకవేళ అక్కడ ఎవరూ లేకపోతే ఇంటిమేషన్‌ స్లిప్‌ ఉంచి వాటిని వెనక్కి తీసుకెళ్తారు. 

  • తరువాత ఏడు రోజుల పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన తపాలా సిబ్బంది వద్ద ఉంచుతారు.

  • అప్పుడు సదరు వ్యక్తి ఇంటిమేషన్‌ స్లిప్, ఏదైనా గుర్తింపు కార్డుతో స్వయంగా వెళ్లి వాటిని తీసుకోవచ్చు.

  • లేదంటే వాటిని శాఖ కార్యాలయానికి పంపుతారు.

  • అక్కడి నుంచి వాటిని పంపిన వ్యక్తికే చేర్చే ప్రయత్నం చేస్తారు. 

  • ఆ వ్యక్తి కూడా లేకపోతే ఆ ప్రాంత కార్యాలయంలో వారం రోజులు ఉంచుతారు.

  • అక్కడ కొంత రుసుం చెల్లించి పంపించిన వ్యక్తే తీసుకోవచ్చు.


ఏడాది పాటు అక్కడే...

  • పంపిన వ్యక్తి కూడా 15రోజుల వరకు రాకపోతే వాటిని రిటర్న్‌డ్‌ లెటర్‌ ఆఫీసర్‌(ఆర్‌ఎల్‌ఓ) కార్యాలయానికి పంపుతారు.

  • అక్కడ మూడు నెలల పాటు ఉంచి పార్సిల్‌ లోపల ఉన్న వస్తువులను తెరచి చూసి ఏదైనా చిరునామా ఉంటే  అక్కడికి పంపిస్తారు.

  • పాడైపోయేవి లేదా ఇతరులకు పనికి రానివి ఉంటే వాటిని డిస్పోజ్‌ చేస్తారు. 

  • విలువైనవి ఉంటే ఒక ఏడాది పాటు అక్కడే భద్రపరుస్తారు.

  • వస్తువులకు సంబంధించిన వ్యక్తికి వార్తా పత్రికల ద్వారా నోటీసులు పంపిస్తారు.

  • అప్పటికీ ఎవరూ స్పందించకపోతే సంవత్సరం తర్వాత ఓ కమిటీ ఏర్పాటు చేసి వాటిని వేలం వేస్తారు. 

  • ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్‌ఎల్‌వో కార్యాలయం చెన్నైలో ఉంది.

  • అక్కడికే వెళ్లి పార్సిళ్లు, ఉత్తరాలను తీసుకోవాల్సి ఉంటుంది.


చరవాణి నంబరు తప్పనిసరి..


  • పోస్టల్‌ కవర్‌పై లేదా పార్సిల్‌పై కొన్ని సార్లు  ఏమరుపాటులో అక్షరాలు సరిగా రాయకపోవచ్చు. 

  • అలా రాసినప్పుడు పంపించే, తీసుకునే వారి ఫోన్‌ నంబర్లు తప్పని సరిగా ఇవ్వాల్సిందే.

  • దీని ద్వారా సదరు వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటారు? వంటి విషయాలు తెలుస్తాయి. 

  • నంబరులో తప్పులు ఉంటే ఆ పార్సిల్‌ను తీసుకోరు. 

  • సరైన నంబరు ఇచ్చిన తరవాత ఓటీపీని పరిశీలించి అప్రూవల్‌ చేస్తారు. 

  • సదరు వ్యక్తి ఆ ఓటీపీ చెప్తే కానీ వస్తువులు ఇవ్వరు.




 
 
 

Comments


bottom of page