పచ్చికూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా?
- AP Teachers TV
- 11 minutes ago
- 1 min read

యూపీకి చెందిన ఓ యువతి మెదడులో సూక్ష్మక్రిములున్న నీటితిత్తులు ఏర్పడి చనిపోయారు. ఆమె ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్ తినేదని... సరిగ్గా శుభ్రం చేయని, పూర్తిస్థాయిలో ఉడకని క్యాబేజీ తినడం వల్ల అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు.
సలాడ్స్.. ఫాస్ట్‌ఫుడ్..పేరు ఏదైనా అందులో కూరగాయలు ఉండాల్సిందే..మరి పచ్చివి...సగం ఉడికీ, ఉడకనివి ఆరోగ్యానికి మేలు చేస్తాయా?వాటివల్ల జరిగే మేలు ఎంత?
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అందులో ఏవి తినాలి? ఏవి తినకూడదు? అనేదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. కొందరు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తే మరికొందరు అలాగే తినేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల కొన్ని పోషకాలు అందే మాట నిజమే అయినా కొద్ది సందర్భాల్లో ప్రాణాపాయం జరగొచ్చు. దీనిపై అవగాహన అవసరం.
నష్టాలు...
జీర్ణ సమస్యలు: ముడి కూరగాయలలో గట్టి ఫైబర్ ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, కడుపునొప్పికి దారితీయొచ్చు.
సహజ విషపదార్థాలు: కొన్ని కూరగాయల్లో సోలనిన్ వంటి సహజ విషపదార్థాలు ఉంటాయి. వీటిని వండడం ద్వారా తొలగించొచ్చు.
బ్యాక్టీరియా, పరాన్నజీవులు: సరిగ్గా శుభ్రం చేయని పచ్చి కూరగాయల్లో ఈకోలి వంటి హానికర బ్యాక్టీరియా, నులిపురుగుల గుడ్లు ఉండొచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.
పోషకాల శోషణ: క్యారెట్, టమాట, క్యాలీఫ్లవర్ వంటి వాటిని వండితేనే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.
తినకూడనివి..
బంగాళాదుంపలు, వంకాయలు, క్యాప్సికం, బ్రకోలి, క్యాలీఫ్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినడకూడదు.
పచ్చి బంగాళదుంపలో ఉండే సోలనిన్ వికారం, తలనొప్పి, ఉబ్బరాన్ని కలిగిస్తుంది.
వంకాయలో చేదు రుచి అజీర్ణ సమస్యలకు కారణమవుతుంది.
పచ్చి టమాటలో ఉండే టొమాటిన్ సమ్మేళనం జీర్ణసమస్యలతో పాటు పోషకశోషణానికి ఆటంకంగా మారుతుంది.
పచ్చి బచ్చలకూరలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ వల్ల కాల్షియం, ఇనుము శోషణకు ఆటంకం కలుగుతుంది.
క్యాబేజీలో నులిపురుగులు, వాటి గుడ్లు ఉంటాయి. ఇవి కంటికి కనిపించవు. వండే ముందు వేడినీటిలో బాగా శుభ్రం చేసి పూర్తిగా ఉడికించి తినాలి.
పచ్చి క్యాబేజీలో ఉండే అధిక ఫైబర్ జీర్ణశక్తి తక్కువ ఉన్నవారిలో తిమ్మిరి, విరేచనాలకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పునీటితో కడగాలి..
- డా.చైతన్య, జీర్ణకోశ వ్యాధినిపుణులు, గుంటూరు
పచ్చి కూరగాయలు, పండ్లు తినే ముందు వాటిని ఉప్పు నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేసి తినాలి.
సాధారణంగా కూరగాయలు వండుకుని తినడమే మేలు. పచ్చివి తినాలంటే వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనల మేరకే చేయాలి.
సరిగా ఉడికించని మాంసం, చేపలు తింటే మెదడులో తిత్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
కూరగాయల్లో పురుగుమందు అవశేషాలు ఉంటాయి కాబట్టి పచ్చివి తినకపోవడమే మంచిది.



Comments