top of page

రాత్రిపూట సెల్‌ఫోన్‌ వెలుగు గుండెకు చేటు

2 minutes ago
1 min read

రాత్రి సమయంలో కొద్దిపాటి ఎక్కువ కాంతిని చూడటం కూడా గుండె నిర్మాణం, దాని పనితీరులో హానికరమైన మార్పులకు దారితీస్తుందని కొత్త పరిశోధనలు వెల్లడించాయి. అమెరికాలోని టులేన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు లు కి నేతృత్వంలోని పరిశోధక బృందం 11,017 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించింది.  దాదాపు సంపూర్ణ చీకటి (0 లక్స్‌) నుంచి గరిష్ఠంగా మూడు లక్స్‌ వరకు వారికి అనుభవమైన కాంతి మోతాదును వారికి అమర్చిన సెన్సర్‌ నమోదు చేసింది. మూడేళ్ల పరిశీలన తర్వాత ప్రయోగంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి వారి గుండె నిర్మాణం, దాని పనితీరులో వచ్చిన మార్పులను పరిశీలించడానికి కార్డియోవాస్క్యులర్‌ మాగ్నెటిక్‌ రెజోనెన్స్‌ (సీఎంఆర్‌) స్కానింగ్‌ చేశారు.


రాత్రిపూట 3 లక్స్‌ కన్నా ఎక్కువ కాంతిని చూసినవారి గుండె ఎడమగది గోడలు మందంగా మారినట్లు, ఫలితంగా జఠరిక లోపలి ఖాళీస్థలం తగ్గినట్లు తేలింది. ఇది గుండెను బలహీనపరిచి వైఫల్యానికి దారితీస్తుంది. రాత్రిళ్లు తక్కువ స్థాయి కాంతి కూడా అలాంటి ప్రమాదాన్నే కలిగించవచ్చని అధ్యయనం హెచ్చరిస్తున్నట్లు ప్రధాన పరిశోధకుడు లు కి వివరించారు. రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌లను ఆపివేయడం, పడుకునే ముందు పరదా వేయడం లేదా ఐ మాస్కుతో నిద్రించడం ద్వారా ఈ ముప్పును సులభంగా నియంత్రించవచ్చని తెలిపారు.


 
 
 

Comments


bottom of page