వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగతమే!

ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం,
జాతీయ గేయం 'వందేమాతరం' ఆలాపనకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలో ఎన్ని చరణాలు పాడాలన్నది పూర్తిగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ అని, పూర్తి గీతాన్ని (ఆరు చరణాలు) పాడలేదనే కారణంతో పౌరులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
వివాదం ఎందుకు మొదలైంది? వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తూ, చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ టి.ఎం. కృష్ణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
వందేమాతరంలోని చివరి నాలుగు చరణాల్లో హిందూ దేవతలను ఉద్దేశించిన అంశాలు ఉన్నాయని, ఇతర మతాల వారిని వాటిని తప్పనిసరిగా పాడేలా ఒత్తిడి చేయడం రాజ్యాంగంలోని లౌకిక విలువలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట మతపరమైన సందేశాన్ని బలవంతంగా ప్రోత్సహించేలా ఈ చట్ట సవరణ ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు విచారణలోని ముఖ్యాంశాలు:
చర్యలు చెల్లవు: మతపరమైన లేదా వ్యక్తిగత విశ్వాసాల కారణంగా పూర్తి చరణాలు పాడని వారిపై కేంద్రం ఎలాంటి నేరపూరిత లేదా దండనాత్మక చర్యలు తీసుకోలేరని సీజేఐ (CJI) ధర్మాసనం తేల్చిచెప్పింది.
కేంద్రానికి నోటీసులు: పూర్తి వందేమాతరం పాడని వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యల అంశాన్ని సునిశితంగా పరిశీలించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
కేంద్రం తీసుకొచ్చిన వందేమాతరం సవరణ చట్టం, కొత్త మార్గదర్శకాలపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
విద్యాసంస్థల్లో మరియు అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గీతాలాపన మార్గదర్శకాలపై స్పష్టత కోసం ఉపాధ్యాయ లోకం ఈ కేసు తదుపరి విచారణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.



Comments