విద్యార్థినులతో పీఈటీ అసభ్య ప్రవర్తన!
- AP Teachers TV
- Jan 5
- 1 min read
ఆదర్శ పాఠశాల విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

మహాముత్తారం, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాల విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రవి, బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆదర్శ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ)గా పనిచేస్తున్నాడు. సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో నలుగురు పదో తరగతి, ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత నెల 27 నుంచి ఈ నెల 2 వరకు రాష్ట్రస్థాయి క్రీడలు జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. వారిని పీఈటీ హైదరాబాద్ తీసుకెళ్లాడు. 27, 28 తేదీల్లో ఆ విద్యార్థినులు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. 29న స్వస్థలాలకు వచ్చారు.
పోటీలు జరుగుతున్న ఒకరోజు సాయంత్రం పీఈటీ మద్యం తాగి వచ్చి ఇద్దరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తిరుగు ప్రయాణంలో విద్యార్థినులను ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కించి..తాను మరో బస్సులో రావడంతో పోకిరీలతో విద్యార్థినులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాలను విద్యార్థినులు.. తమ తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు.. విద్యార్థినుల నుంచి ఫిర్యాదు తీసుకుని రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు. పీఈటీ మద్యం తాగి తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, అసభ్య పదజాలంతో దూషించాడని మిగతా ముగ్గురు విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పీఈటీకి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.












Comments