త్వరలో మరో డీఎస్సీ: నారా లోకేశ్
- AP Teachers TV
- 10 minutes ago
- 1 min read

డీఎస్సీ ద్వారా మరో మూడు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. విజయనగరంలోని దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్లస్టర్ పాఠశాలల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతినెలా ఒక నియోజకవర్గం క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొంటానన్నారు. సమాజంలో మనం ఆశించే మార్పు విద్యతోనే సాధ్యమని తాను బలంగా నమ్ముతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోధనలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకొని, వారి సూచనలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,034 సముదాయాల ఉపాధ్యాయులు లైవ్‌లో పాల్గొన్నారు.
పరిశీలనలో ప్రత్యేక టెట్
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించే అంశం తమ పరిశీలనలో ఉన్నట్లు లోకేశ్ తెలిపారు. ఉపాధ్యాయులెవరూ ఆందోళన చెందొద్దని, బోధనపై దృష్టి సారించాలని సూచించారు. విజయనగరంలో ఏపీ ఉపాధ్యాయ, రాష్ట్రోపాధ్యాయ సంఘాల వినతుల మేరకు ఆయన ఈ విధంగా స్పందించారు.
మెగా డీఎస్సీపై జగన్‌తో చర్చకు సిద్ధం..
టైమ్ ఫిక్స్ చేస్తే మెగా డీఎస్సీపై చర్చకు తాము సిద్ధమని, తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి బయటకు రావాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేశ్ సవాలు విసిరారు. విజయనగరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే మూడుసార్లు గెలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని లోకేశ్ గుర్తుచేశారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసే పనిచేస్తాయని వివరించారు.



Comments