రాత పరీక్ష లేదు.. ‘పది’తో పోస్టల్ ఉద్యోగం.. వేతనం ఎంతంటే?
- AP Teachers TV
- 29 minutes ago
- 1 min read

India Post GDS Recruitment | ఇంటర్నెట్ డెస్క్: తపాలా శాఖ(Indian Post)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19వరకు ఆన్‌లైన్ ఓటీఆర్ (One Time Registration) చేసుకొనేందుకు పోస్టల్ శాఖ అధికారులు అవకాశం కల్పించారు. అలాగే, సెప్టెంబర్ 2 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100. మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుం నుంచి మినహాయింపు ఇచ్చారు.
పరీక్ష లేదు.. వేతనం ఎంతంటే?
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్‌సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తపాలా శాఖ అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అలాగే,అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్ సేవక్‌కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో భర్తీచేసే ఉద్యోగాలెన్నంటే..?
దేశ వ్యాప్తంగా అన్ని పోస్టల్ సర్కిళ్లలో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. ఏపీలో 918, టీజీ 419 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లుగా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఏ సర్కిల్‌లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో వెబ్‌సైట్‌లోని Vacant Postsపై క్లిక్ చేసి సర్కిళ్లు, డివిజన్ల వారీగా పేర్కొన్న జాబితాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు దాదాపు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే, వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(IPPB)కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహకాలు అందిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. పోస్టల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.



Comments