top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • How to become rich : ధనవంతులు అవ్వాలంటే.. ఈ అలవాట్లు ఉండాల్సిందే!

    How to become rich: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైరైపోయి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనే కాన్సెప్ట్‌ విదేశాల్లో విస్తరిస్తోంది. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆ దిశగా యువత అడుగులు వేస్తోంది. మరి ఎర్లీగా రిటైర్‌ అవ్వాలంటే..? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైరైపోయి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనే కాన్సెప్ట్‌ విదేశాల్లో విస్తరిస్తోంది. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆ దిశగా యువత అడుగులు వేస్తోంది. అయితే, ఎర్లీగా రిటైర్‌ అవ్వాలంటే.. అంతకుముందే ఎక్కువ మొత్తంలో డబ్బును మూటగట్టుకోవాలి కదా! సరైన నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ, కచ్చిత ప్రణాళిక ఉంటేనే అది సాధ్యమంటూ.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.. చిన్న వయసులోనే పెద్ద మొత్తం పోగేయండి మరి!   పొదుపునకు పక్కనబెట్టాకే.. ‘ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది.. పొదుపు గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే మొత్తం ఖర్చు చేసేయడమే..!’- చాలామంది యువత ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ, అది సరైనది కాదని నిపుణుల మాట. కొలువు వచ్చిన దగ్గర్నుంచే పొదుపు, పెట్టుబడుల నిమిత్తం కొంత పక్కనబెట్టాకే.. మిగిలింది ఖర్చులకు వాడుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్‌లో అదే అలవాటుగా మారుతుంది.  బడ్జెట్‌కు కట్టుబడాలి.. ఆర్థిక విజయానికి బడ్జెట్‌నే దిక్సూచీగా చెబుతుంటారు. అందుకే ముందుగా మన అవసరాలపై మనకు స్పష్టత ఉండాలి. ఆదాయం, వ్యయాల ఆధారంగా ఇంటి బడ్జెట్‌ని వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకుమించి ఖర్చు చేయకూడదనే నియమం పెట్టుకోవాలి. నెలాఖరున ఖర్చులను ఒకసారి పరిశీలిస్తే.. ఎక్కడ ఆదా చేయవచ్చో మనకో అవగాహన వస్తుంది. మరుసటి నెల నుంచి ఆ మిగిలిన మొత్తాన్నీ పొదుపులోకి మళ్లించొచ్చు.   త్వరగా.. క్రమంతప్పకుండా.. ‘అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరం ఏముంది?’ అని అనుకోకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొదుపును ప్రారంభించాలి. ఇప్పుడది చిన్నమొత్తమే అయినా దీర్ఘకాలంలో ఎక్కువ జమ అవుతుంది. సొమ్మంతా ఒకే దగ్గర కాకుండా, వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి.  రుణాల జోలికిపోకండి సాధ్యమైనంత వరకు రుణాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ మరీ అవసరమైతే.. అంతా పరిశీలించాకే ఎక్కడ తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడే తీసుకోవాలి. ఒకవేళ మీరు సంపాదించే నాటికే రుణాలేమైనా ఉంటే.. వాటిల్లో ముందుగా ఎక్కువ వడ్డీ చెల్లించేది తీర్చేయండి.  తక్కువలోనే జీవించండి ఆదా చేయడమే మన ఏకైక లక్ష్యం అయినప్పుడు.. ఇతరులతో పోల్చుకొని హంగులకు పోకుండా, అనవసరమైనవి కొనకుండా సాధారణ జీవితాన్నే అలవాటుగా చేసుకోవాలి.  స్థోమత ఉన్నా అంతకంటే తక్కువలో బతికితేనే స్వల్ప కాలంలో అధిక మొత్తం పోగేయగలం.   అత్యవసర నిధిని సమకూర్చుకోండి ఎప్పుడు ఏ అవసరం ఎటునుంచి వస్తుందో తెలియని రోజులివి. అందుకే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. ఉద్యోగులైతే కచ్చితంగా ఆరు నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోమని చెబుతుంటారు. అనుకోని ప్రమాదం, అనారోగ్యం, జాబ్‌పోవడం, కారు రిపేర్‌ వంటి ఆపద సమయాల్లో ఆ మొత్తం ఆదుకుంటుందన్నమాట. మన ఇళ్లల్లో అమ్మలు పోపులపెట్టెలో దాచిన కొంచెం డబ్బే.. కష్టకాలంలో మనకు బంగారు నిధిలా కనిపిస్తుంది కదా.. అలాగన్నమాట.   పన్నుల భారం పడకుండా.. సంపాదించడం ఒకెత్తయితే.. పన్నుల భారం పడకుండా చూసుకోవడం అంతకుమించిన ఎత్తు. అందుకే, ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదిస్తూ.. ట్యాక్స్‌ నుంచి మినహాయింపు పొందే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవద్దు.  తప్పు లేదు.. బేరమాడండి కొందరు చిన్నవాటికీ బేరమాడుతుంటారు. మరికొందరేమో దాన్ని నామోషీలా భావిస్తుంటారు. కానీ, అది సరికాదు. మన చేతి నుంచి డబ్బు ఇచ్చే అంశం ఏదైనా.. సాధ్యమైనంత బేరం ఆడితేనే ఎంతోకొంత మిగుల్చుకోవచ్చు. పక్కనోళ్లు ఏమనుకుంటారోననే బిడియాలన్నీ వదిలితేనే మన లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకోగలం.  కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి..  నిత్యం ఏదో ఒక కొత్త అంశం నేర్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. మార్కెట్‌కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమో, ఉన్నదానికి మెరుగులు దిద్దుకోవడమో చేసుకుంటూ అదనపు ఆదాయంపై దృష్టిసారించాలి. కాలానుగుణంగా ఆర్థిక ప్రణాళికలో వస్తున్న మార్పులను గమనిస్తూ.. అందుకు తగినట్లు మన వ్యూహాలు అమలుచేయాలి.  చివరిగా.. ధనవంతులు కావడమనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని చాలామంది యువత భావన. అందులోంచి బయటకొచ్చి.. ఆర్థిక అలవాట్లే సంపద సృష్టికి సోపానాలని గుర్తెరిగితే, అనుకున్న దానికంటే ముందే కోటీశ్వరులు కావొచ్చు. ఎర్లీగా రిటైర్మెంట్‌ తీసుకొని నచ్చినట్లు హాయిగా బతకొచ్చు.

  • ఈ టీచర్ ది ఎంత మంచి మనసో

    ఈ టీచర్ ది ఎంత మంచి మనసో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ కొన్నాళ్ల క్రితం సైన్యంలో పనిచేశాడు. కార్గిల్‌ యుద్ధంలోనూ, పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడూ సైనికుడిగా పోరాడాడు. 2009లో రిటైర్‌ అయ్యాక టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి డైట్‌లో సీటు సాధించాడు. అది పూర్తి చేశాక టెట్‌ పాసై 2012లో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ)గా ఉద్యోగం సాధించిన శ్రీనివాస్‌కు పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. అప్పటికి అక్కడ పన్నెండు మంది విద్యార్థులే ఉన్నారు. వారికి ఉన్నత ప్రమాణాలతో బోధించడం మొదలుపెట్టిన శ్రీనివాస్‌- నవోదయ సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని భావించి కోచింగ్‌ ఇవ్వడం ప్రారంభించాడు. తాను స్కూలుకు సెలవు పెట్టకుండా, పిల్లలు మానకుండా జాగ్రత్తలు తీసుకునే అతని గురించి మార్కాపురంతోపాటు ఆ చుట్టుపక్కల 15 గ్రామాలకు చెందిన వాళ్లు తెలుసుకుని తమ పిల్లల్ని కూడా ఓబులక్కపల్లి స్కూల్లో చేర్పించడం మొదలుపెట్టారు.. ఇదిలా ఉంటే అక్కడ బోధన మెరుగుపడి, విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ వసతుల లేమి ఇబ్బందికరంగా ఉండేది. దాంతో శ్రీనివాస్‌ తన దగ్గరున్న ఐదు లక్షలకు, దాతల నుంచి సేకరించిన పది లక్షలు జోడించి - స్కూలుకు రంగులు వేయించడంతోపాటు ఫ్యాన్లూ, బల్లలూ, వాటర్‌ ఫిల్టర్‌ వంటివి సమకూర్చాడు. టాయిలెట్లు బాగు చేయించి కార్పొరేట్‌ స్థాయిలో స్కూలు రూపురేఖల్ని మార్చేయడంతో అక్కడి విద్యార్థుల సంఖ్య 250కి చేరింది. అలానే ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా సొంతంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి- పలు కార్యక్రమాలు చేపట్టిన శ్రీనివాస్‌ గతేడాది బోడపాడులోని ఎంపీపీఎస్‌ స్కూలుకు బదిలీ అయ్యాడు. అప్పటికి సుమారు నలభై మంది పిల్లలు చదివే ఆ స్కూలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుండేది. ఆ పరిస్థితుల్ని చూసిన శ్రీనివాస్‌ దాదాపు నాలుగు లక్షలరూపాయలు ఖర్చు చేసి ఆ బడినీ బాగు చేయించాడు. స్నేహితుల ఆర్థిక సాయంతో స్కూల్లో మరికొన్ని వసతులూ కల్పించిన అతని వద్ద శిక్షణ తీసుకున్నవారిలో దాదాపు ఇరవై మంది చిన్నారులు నవోదయ సీటు సాధించారు. అలా విద్యార్థుల కోసం ఎంతో చేస్తున్న శ్రీనివాస్‌ ఆర్మీ నుంచి వచ్చే పింఛను మొత్తాన్ని స్కూళ్లను బాగు చేయడానికే వినియోగించడం విశేషం.

  • ఫోన్‌ పోయిందా? ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సిమ్‌ మార్చినా కనిపెట్టొచ్చు! Lost your phone?

    Lost your phone: ఫోన్‌ పోగొట్టుకున్నారా? ఈ పోర్టల్‌ సాయంతో మీ ఫోన్‌ను ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలా అంటే..? Lost your phone | మొబైల్ ఫోన్‌.. ఇది లేకుండా చాలా మందికి రోజు గడవదు. మనిషి జీవితంతో అంతలా మమేకమైందీ గ్యాడ్జెట్‌. డబ్బు చెల్లింపుల నుంచి కాంటాక్టులు, మెసేజ్‌లు, ఫొటోలు, విజ్ఞానం, వినోదం.. ఇలా అన్నింటికీ సెల్ ఫోన్ పైనే ఆధారపడుతుంటాం. ఇంతటి విలువైన ఫోన్‌ చోరీకి గురైతే? సాధారణంగా అయితే ఫోన్‌ పోతే ఆశలు వదుకోవాల్సిందే. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన కారణంగా.. పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవడం సాధ్యమవుతోంది. సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ పనిచేయకుండా బ్లాక్‌ చేయడం.. అది దొరికాక తిరిగి అన్‌బ్లాక్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఎవరైనా ఫోన్‌ పోయిన తర్వాత తొలుత మీసేవ కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ప్రతిని భద్రపరచుకోవాలి. అనంతరం సెల్‌ఫోన్‌ స్టోర్‌కు వెళ్లి అదే నంబర్‌పై కొత్త సిమ్‌ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గానే పాత సిమ్‌ బ్లాక్‌ అయిపోతుంది. అనంతరం సీఈఐఆర్‌ పోర్టల్‌ ఓపెన్ చేస్తే కనిపించే అందులో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌ (Block Stolen/Lost Mobile) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లో అప్పటివరకు వినియోగించిన ఫోన్‌ నంబర్లు, ఐఎంఈఐ (IMEI) నంబర్లతోపాటు అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు ప్రతి, వ్యక్తిగత గుర్తింపుకార్డు (ఆధార్‌ మాదిరి), ఫోన్‌ కొనుగోలు రశీదు (అందుబాటులో ఉంటే) అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం.. మీ కొత్త సిమ్‌కు రిక్వెస్ట్‌ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా కేసు స్టేటస్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా సీఈఐఆర్‌ పోర్టల్‌ సిబ్బంది ఆ ఫోన్‌ను బ్లాక్‌ చేసి పనిచేయకుండా చేస్తారు. వేరే సిమ్‌ వేసినా.. సాధారణంగా ఫోన్‌ దొంగిలించినా/ దొరికినా.. వాళ్లు దానిలో కొత్త సిమ్‌ వేసుకొని వినియోగించుకోవాలని చూస్తారు. ఇలా బ్లాక్‌ చేసిన మొబైల్లో ఇతరులు ఎవరైనా సిమ్‌ కార్డ్‌ వేస్తే, వెంటనే సీఈఐఆర్‌కు అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. పోలీసులతో పాటు దొంగిలించిన ఫోన్‌లో వేసిన కొత్త సిమ్‌కు మెసేజ్‌ వస్తుంది. అలా మెసేజ్‌ రాగానే పోలీసులకు ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందనే విషయం సులువుగా తెలిసిపోతుంది. వెంటనే పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం వివరిస్తారు. ఇక దొంగిలించినా లేదా పొరపాటున దొరికినా ఆ ఫోన్‌ను తిరిగి ఇవ్వకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని గ్రహించి వెంటే మొబైల్‌ను తిరిగి ఇవ్వాల్సిందే. అన్‌- బ్లాక్‌ చేసేయండిలా.. ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్‌ తిరిగి దొరికితే యూజర్‌ సీఈఐఆర్‌ పోర్టల్‌లో అన్‌-బ్లాక్‌ ఫౌండ్‌ మొబైల్‌ (Un-Block Found Mobile) ఆప్షన్‌ను ఎంచుకొని రిక్వెస్ట్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వివరాలు సమర్పిస్తే.. ఫోన్ అన్‌-బ్లాక్‌ అవుతుంది. అలా దాన్ని తిరిగి వినియోగించుకోవచ్చు. మీ ఐఎమ్ఈఐ నంబర్‌ బ్లాక్‌లో ఉందా? ఇక సాధారణంగా చోరీ చేసిన ఫోన్లను ఇతరులకు తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అలా కొనుగోలు చేసినప్పుడు చిక్కుల్లో పడకుండా ముందు జాగ్రత్తగా.. తాము ఎంచుకున్న ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం KYM<15 అంకెల ఐఎమ్ఈఐ నంబర్‌> టైప్‌ చేసి14422కు ఎస్సెమ్మెస్ పంపి మీ ఫోన్‌ స్టేటస్ తెలుసుకోవచ్చు.

  • నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించవలసిన కార్యక్రమాలపై ప్రభుత్వ తాజా ఆదేశాలు

    నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించవలసిన కార్యక్రమాలపై ప్రభుత్వ తాజా ఆదేశాలు: నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించవలసిన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలపై సూచనలు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతము: శ్రీ విజయ రామ రాజు వి., ఐ.ఏ.ఎస్. ఆర్.సి. నం: ESE02-28022/30/2024-PLG-CSE తేది: 24/11/2024 విషయం: పాఠశాల విద్యా శాఖ – 2024 నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలు నిర్వహణ – కొన్ని సూచనలు – జారీ చేయబడినవి. సూచనలు: 1. 2024 అక్టోబర్ 17న చండీగఢ్‌లో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ముఖ్యమంత్రుల సమావేశంలో చేపట్టవలసిన కార్యాచరణ పాఠాలు. 2. ఈ కార్యాలయ ఆదేశాలు RC No.ESE02-28022/30/2024-PLG-CSE, తేది 18.11.2024. 3. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, న్యూ ఢిల్లీ నుండి జాయింట్ సెక్రటరీ డి.ఓ. నం.17-11/2023-Coord, తేది 21.11.2024. <<<>>> సూచనలు: కేంద్ర ప్రభుత్వం 75వ భారత రాజ్యాంగ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించి, 2024 నవంబర్ 26న పాఠశాలల్లో కొన్ని కార్యకలాపాలను నిర్వహించమని సూచనలు పంపించింది. వాటిలో ముఖ్యమైనవి: 1. ఉదయం అసెంబ్లీలో రాజ్యాంగం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం. 2. విద్యార్థులకు రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం. 3. సృజనాత్మక కార్యక్రమాలు (సెల్ఫీ పాయింట్లు, హ్యూమన్ చైన్‌లు, రాప్ సాంగ్స్ వంటి) నిర్వహించడం. 4. ప్రఖ్యాత వ్యక్తులను ఆహ్వానించి ఉపన్యాసాలు/ చర్చలు/ సెమినార్లు నిర్వహించడం. 5. రాజ్యాంగ ప్రాముఖ్యతపై ప్రసంగాలు. 6. చిత్రలేఖనం, పోస్టర్ తయారీ, హస్తకళల పోటీలు. 7. పాఠశాల అసెంబ్లీలో రాజ్యాంగ ప్రస్తావన (ప్రీయాంబుల్) చదవడం. DIKSHA ప్లాట్‌ఫారమ్‌లో రాజ్యాంగ దినోత్సవ మాడ్యూల్‌ను అప్‌లోడ్ చేస్తారు. దీనిని అనువదించి, నేపథ్య సాహిత్యంగా ఉపయోగించుకోవాలి. PM-eVidya ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయబడే రాజ్యాంగ దినోత్సవ వీడియోను విద్యార్థులందరికీ చూపించండి. MyGov.in పోర్టల్‌లో ఉన్న క్విజ్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా పరిపాలకులు పాల్గొనాలని ప్రోత్సహించండి. అందరూ కార్యాచరణ నివేదికలు, ఫోటోలు, రచనలు మొదలైనవి సమర్పించాలి. అందిన సమాచారం ఆధారంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక పంపవలెను. హస్తాక్షరం: విజయ రామ రాజు వి., పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ పోస్టు నచ్చితే కింద కనిపిస్తున్న హార్ట్ గుర్తుపై నొక్కి మీ ప్రోత్సాహం తెలియజేయండి.

  • వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్ గా చదువుకోవచ్చు

    వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్ గా చదువుకోవచ్చు ఆడియో సందేశాలను టెక్స్ట్ రూపంలోకి మార్చే కొత్త ఫీచర్ వాట్సాప్లో త్వరలో అందుబాటులోకి రానుంది. కీలక సమావేశాల్లో ఉన్నప్పుడు వచ్చే ఆడియో సందేశాలు, ఎవరూ వినకూడదనుకున్న వాటిని టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. దీనిని Settings-Chats-Transcription ఉపయోగించి ఎనేబుల్ చేసుకోవచ్చు. అనంతరం ఆడియో మెసేజ్లపై లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు.

  • లక్ష్మీదేవి అడ్రస్.. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌: Micro Investment

    చిన్న నాణాలంటూ చిన్నచూపు చూడకండి.జేబుకు బరువై పోతున్నాయని బేజారైపోకండి. ఆ చిల్లర పైసలే రేపు నోట్లు అవుతాయి. నోట్ల కట్టలూ అవుతాయి. చిన్న నాణాలంటూ చిన్నచూపు చూడకండి.జేబుకు బరువై పోతున్నాయని బేజారైపోకండి. ఆ చిల్లర పైసలే రేపు నోట్లు అవుతాయి. నోట్ల కట్టలూ అవుతాయి. ఒక్క రూపాయితోనూ పొదుపు-మదుపు ఆరంభించే అవకాశం ఉన్న ‘మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌’ ప్రాధాన్యాన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులూ నొక్కి చెబుతున్నారు. షేర్లు, బంగారం, బాండ్లు... ఇలా అనేక మార్గాల్లో మదుపు చేసుకోవచ్చని సిఫార్సుచేస్తున్నారు.  అమ్మ పోపుల డబ్బా... ఓ మంత్రాల పెట్టె! పెద్దోడికి పరీక్ష ఫీజు కడుతుంది. చిన్నోడికి కొత్త సైకిలు కొనిస్తుంది. చిట్టితల్లికి వెండి పట్టీలు చేయిస్తుంది. తాతయ్య వైద్యానికి సాయం అందిస్తుంది. బంధు మిత్రులకు భరోసా ఇస్తుంది. అలా అని, అమ్మకేం జీతం రాదు. పసుపుకుంకాల కింద వచ్చిన ఆస్తిపాస్తులూ ఉండవు. నెలనెలా ఇంటి ఖర్చులకు నాన్న ఇచ్చే డబ్బులోనే... కొంత మిగలగా, కొంత మిగుల్చుకోగా పోగైన చిల్లర పైసలే అవన్నీ! తన పొదుపరితనంతో, ముందుజాగ్రత్తతో, కించిత్‌ లౌక్యంతో... ఆ పదులను వందలుగా, వందలను వేలుగా మార్చేస్తుంది అమ్మ. పర్సనల్‌ ఫైనాన్స్‌ పరిభాషలో చెప్పాలంటే, ఇదంతా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ మహత్యమే! ఒక్క అడుగుతో వేయిమైళ్ల ప్రయాణం సాధ్యమైనప్పుడు... ఒక్క రూపాయితో సుదీర్ఘ ఆర్థిక యాత్రను మాత్రం ఎందుకు ఆరంభించలేం? ఆ ఆశావాదమే మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌కు తొలి పెట్టుబడి. క్రమశిక్షణతో అడుగేస్తే, పద్ధతిగా మదుపు చేస్తే మనం చిల్లర పైసలంటూ చిన్నచూపు చూసే రూపాయి బిళ్లలూ, మనం పోతేపోనీ అని నిర్లక్ష్యం చేసే పది రూపాయల నోట్లూ దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టిస్తాయి.   బాత్‌రూమ్‌లోని కుళాయిలో లీకేజీ మొదలవుతుంది. టప్‌టప్‌మంటూ నిమిషానికో నీటిచుక్క కారిపోతూ ఉంటుంది. సాయంత్రానికంతా సగం బకెట్‌ నీళ్లు డ్రైనేజీ పాలవుతాయి. తెల్లారేసరికి ఓవర్‌హెడ్‌ ట్యాంకు మీదా ప్రభావం పడుతుంది. రెండు రోజులకైనా ఖాళీ కాని ట్యాంకు, ఇరవై నాలుగు గంటలకే నిండుకుంటుంది. మళ్లీ మోటారు వేసుకోవాలి. దెబ్బకు కరెంటు బిల్లు పెరుగుతుంది. లీకేజీ వల్ల బాత్‌రూమ్‌ ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఫలితంగా ఫ్లోర్‌ పాచిపట్టి పోతుంది. పొరపాటున ఎవరైనా కాలుజారి పడిపోతే... హాస్పిటల్‌ బిల్లు తడిసి మోపెడవుతుంది. అయినా, ఇక్కడ వృథాగా పోతున్నది నీళ్లు మాత్రమేనా? కానేకాదు. మన చెమట, మన రక్తం, మన శ్రమ, మన సంపాదన. ఇదే పోలిక చిల్లర పైసలకూ వర్తిస్తుంది. ఒక ఒకటి ఒకటే. కానీ వంద ఒకట్లు వంద. వంద వందలు పదివేలు. పదివేల వందలు అక్షరాలా పదిలక్షలు! తాబేలు స్ఫూర్తితో... పురాణాలు తాబేలును లక్ష్మీదేవి వాహనంగా చెబుతాయి. తాబేలు కవచంపై శ్రీచక్రం ఉన్న బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం అదృష్ట చిహ్నంగా భావిస్తారు. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా తాబేలు పరుగుతో పోల్చుకోవచ్చు. అందులో మెరుపు వేగం ఉండకపోవచ్చు. అచ్చంగా మందగమనమే కావచ్చు. కానీ స్థిరత్వం ఉంటుంది. ఆ పట్టుదల ముందు దీర్ఘకాలంలో కుందేలైనా కుదేలు కావాల్సిందే. కుందేలు ఆయువు మహా అయితే పదేళ్లు. అదే తాబేలు కనీసం నూట పదేళ్లు బతుకుతుంది. తన జీవితకాలంలో కుందేలు కంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తుంది. సుదీర్ఘ జీవనం, అలుపెరుగని ప్రయాణం... తాబేలు ప్రత్యేకతలు. అత్యుత్తమ పెట్టుబడుల లక్షణాలు కూడా. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ ఏనాడూ తప్పనిసరి ఖర్చులు తగ్గించుకోమని ఒత్తిడి చేయదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అదనంగా సంపాదించమనీ సలహా ఇవ్వదు. అర్థంలేని వృథాను అరికట్టమంటుంది. దుబారాను దూరం పెట్టమంటుంది. ఖర్చుల తర్వాత మిగిలే చిల్లర పైసలను మదుపు చేస్తే చాలని సూచిస్తుంది. నిత్యావసరాలు, బట్టలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు... దేన్నయినా డిస్కౌంట్‌ సేల్‌లోనే కొనడం. ఆన్‌లైన్‌ క్రెడిట్‌ పాయింట్లను వినియోగించుకోవడం. విద్యుత్‌ వృథాను అరికట్టడం. ఫ్రిజ్‌లోని పదార్థాలు చెత్తపాలు కాకుండా జాగ్రత్తపడటం. చిన్నపాటి చిట్కాలతో వాహనాల మైలేజీ పెంచుకోవడం. సినిమా, రెస్టారెంట్‌ ఖర్చులకు కొంతమేర కోత పెట్టడం. క్రెడిట్‌కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తూ ఆలస్య రుసుముల భారం వదిలించుకోవడం. ఇలా, నెలవారీ బడ్జెట్‌లో వృథాకు కళ్లెం వేయడానికి ఎన్నో మార్గాలు. ప్రతి కొత్త అలవాటులానే, మొదట్లో కష్టంగా అనిపించినా మెల్లమెల్లగా జీవితంలో భాగమైపోతుంది. క్రమంగా బడ్జెట్‌లో పది నుంచి ఇరవైశాతం మిగులు సాధిస్తాం. ఆ సొమ్మును మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ వైపు మళ్లించుకుంటాం. రాజు, రాము ఒకే కంపెనీలో ఉద్యోగులు. హోదాలూ, జీతాలూ సమానమే. ఒకే ఫండ్‌ హౌస్‌ నుంచి ప్రతినెలా చెరో పదివేలు ‘సిప్‌’ చేస్తున్నారు. సొంతింటి ప్రయత్నంలో భాగంగా ఇద్దరూ తమ పెట్టుబడులన్నీ నగదు చేసుకున్నారు. రాజుతో పోలిస్తే రాము రూ.లక్ష అదనంగా అందుకున్నాడు. కారణం... రాము సిప్‌తో పాటు ‘మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌’ మార్గాన్నీ అనుసరించాడు. ఆ ‘చిల్లర’ పైసల కానుకే ఈ నోట్ల కట్ట. రాజు ఎందుకో ఈ మార్గాన్ని విస్మరించాడు. ‘మైక్రో’ప్రెన్యూర్లు వచ్చేశారు... ‘డబ్బు సంపాదించడానికే పనిచేసేవారు కుబేరులు కాలేరు. డబ్బుతో పనిచేయించు కోవడం తెలిసినవాళ్లే సంపన్నుల జాబితాలో చేరతారు’ అంటారు రిచ్‌డాడ్‌-పూర్‌డాడ్‌ రచయిత రాబర్ట్‌ కియోసాకీ. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం డబ్బు భాష నేర్చుకుంటాం. డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. డబ్బుతో పనిచేయించడం తెలుసుకుంటాం. ఆ బలమైన పునాదులతో మన ఆర్థిక సౌధాన్ని నిర్మించుకోవచ్చు. ఇక్కడ మదుపు చేయడానికి అనేక మార్గాలు. స్టాక్స్‌, డిజిటల్‌ గోల్డ్‌, ఎక్స్చేంజ్‌ ట్రేడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు), మ్యూచువల్‌ ఫండ్స్‌... దేన్నయినా ఎంచుకోవచ్చు. తాత్కాలికంగా ఎగుడుదిగుళ్లు ఉన్నా దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడినే అందుకుంటాం. అందుకే, కొత్తతరం ఇటువైపు మొగ్గు చూపుతోంది. ఇంటర్నెట్‌ వినియోగం, యూపీఐ చెల్లింపులు, యువత ఆర్థిక అలవాట్లు... మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ బూమ్‌కు ప్రధాన కారణం. ఇప్పటికే, ఎంతోమంది ఫిన్‌టెక్‌ ఆంత్రప్రెన్యూర్లు చిల్లరను నోట్లుగా మార్చే పనిలో తలమునకలై ఉన్నారు. ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో కాలు పెట్టడానికి కనీస అర్హత... ఓ ఖరీదైన బ్రీఫ్‌కేస్‌, అందులో పెద్దనోట్ల కట్టలు. అదంతా గతం. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ పుణ్యమాని... చిల్లర పైసలతోనూ శ్రీమహాలక్ష్మి కటాక్షం సాధ్యం అవుతోంది. ఆ మదుపు కూడా మనకు అనువైన పద్ధతుల్లోనే. ఏ ఇ-కిరాణా కొట్టులోనో సరుకులు ఆర్డర్‌ చేస్తాం. బిల్లు మూడువందలా డెబ్భై రూపాయలు అవుతుంది. ఇంకో ముప్పై రూపాయలు జోడిస్తే... ‘చుత్తా’ అయిపోతుంది. మన అనుమతితో ఆ అదనపు సొమ్ము నేరుగా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు చేరుతుంది. రోజూ మనం ఆన్‌లైన్‌లో ఏదో ఒకటి తెప్పించుకుంటూనే ఉంటాం కాబట్టి, ప్రతి చెల్లింపుతో కొంత చిల్లర మదుపు ఖాతాలో  జమ అవుతుంది. ఖర్చు చేస్తూనే పొదుపు చేయడమంటే ఇదే! నిత్యం పది, పాతిక, వంద... ఇలా ఓ స్థిరమైన చిన్న మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి మళ్లించేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఖర్చుచేసే ప్రతి రూపాయికీ, పది పైసల చొప్పున ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్‌కు మళ్లించే డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. స్పెన్నీ, డెసిమల్‌, స్పేర్‌8 తదితర వేదికలు ఆ మొత్తాల్ని రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. జార్‌లాంటి సంస్థలైతే నేరుగా ఇ-బంగారాన్నే కొనిపెడతాయి. చెల్లింపు జరిగిన మరునిమిషమే ఆయా సంస్థల యాప్‌లలో మన పెట్టుబడుల వివరాలు నమోదు అవుతాయి. కొన్ని యాప్స్‌ ‘గేమిఫికేషన్‌’ పద్ధతిలో పొదుపు-మదుపు పాఠాలూ నేర్పుతాయి. మన డబ్బు ఎలా వృద్ధి చెందుతున్నదీ నేరుగా యాప్‌లో చూసుకోవచ్చు. మరీ అవసరమైతే ఆ రోజు విలువకు అమ్ముకోవచ్చు. గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విషయానికొస్తే... కాయిన్‌ రూపంలోనో, బిస్కెట్‌ రూపంలోనో అచ్చంగా బంగారమే కావాలనుకుంటే కొరియర్‌ ద్వారా పంపుతారు. ఎవరి మీదో ఆధారపడటం ఎందుకనుకుంటే... నేరుగా మనమే మదుపు చేసే అవకాశాలూ ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కూడా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రోత్సహిస్తోంది. నెలకు వంద రూపాయల పెట్టుబడితోనూ మైక్రో-సిప్‌ను రూపొందించాలని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలను ఆదేశించింది. ఈ తరహా పథకాలకూ ఆదరణ పెరుగుతోంది. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను తాత్కాలిక అవసరాల కోసం ఉపసంహరించుకోకుండా, కనీసం ఓ పదేళ్లు కొనసాగించడం మంచిదని చెబుతారు నిపుణులు. అప్పుడే, చిల్లర మదుపులోని చమక్కుల్ని కళ్లారా చూడగలం. అదో కిక్‌! మనం మిఠాయి కొట్టుకు వెళ్లగానే, దుకాణదారు ఓ స్వీటు ముక్క చేతిలో పెడతాడు. వెంటనే నోట్లో వేసుకుంటాం. రుచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పావు కిలో కొనడానికి వెళ్లినవాళ్లం... ఏకంగా రెండు కిలోలు ఆర్డర్‌ చేస్తాం. బద్ధకించీ బద్ధకించీ... మొత్తానికి ఓ రోజు వాకింగ్‌కు బయల్దేరతాం. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాలు భలేగా నచ్చుతాయి. పదిహేను నిమిషాల్లో తిరిగొద్దామని వెళ్లినవాళ్లం కాస్తా గంటసేపు నడిచేస్తాం! ఏదో సందర్భంలో ఓ మిత్రుడు పాత పుస్తకం చేతిలో పెడతాడు. ఆర్నెల్ల తర్వాత... యథాలాపంగా రెండు పేజీలు తిరగేస్తాం. ఆసక్తిగా అనిపిస్తుంది. ఏకబిగిన చదివేస్తాం! మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా అలాంటిదే. చిల్లరతో మొదలైనా చిల్లర దగ్గరే ఆగిపోదు. పెద్దనోట్లకూ విస్తరిస్తుంది. ఒక్కసారి పొదుపు అవసరం తెలిశాకా, మదుపు ప్రాధాన్యం అర్థమైపోయాకా, రాబడి రుచి మరిగాకా... మన ఆలోచనా విధానమే మారిపోతుంది. డబ్బును చూసే పద్ధతిలోనూ తేడా వచ్చేస్తుంది. ఖర్చయిపోగా మిగిలిన సొమ్మును దాచుకోవడం కాదు, దాచుకోగా మిగిలిన సొమ్మునే ఖర్చు చేయాలని తీర్మానించుకుంటాం. అత్యవసర నిధి, రిటైర్మెంట్‌ ఫండ్‌ గురించీ సీరియస్‌గా ఆలోచిస్తాం. చిల్లర విషయంలో మునుపటి తేలికభావం మాయమైపోతుంది. కాబట్టే, చిల్లర మదుపును ‘ఛేంజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ అనీ అంటారు. నిజానికి ఇది ‘మార్పు’ ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా. ముహూర్తాలతో పన్లేదు. మంచిరోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో పెద్ద మొత్తం ఉండాలన్న నియమం లేదు. బోనస్‌లూ, ఇంక్రిమెంట్లూ వచ్చిన తర్వాతే మొదలుపెట్టాలనే షరతు లేదు. దలాల్‌స్ట్రీట్‌ కదలికల మీదో, బంగారం ధరల హెచ్చుతగ్గుల మీదో పట్టు సాధించాకే ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడమూ సరికాదు. చిన్నచిన్న పెట్టుబడులు పెడుతూనే మార్కెట్‌ మెలకువలు తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది మైక్రో ఇన్వెస్ట్ట్‌మెంట్‌. ఆ ప్రయత్నంలో ఏదైనా పొరపాటు చేసినా పెద్దగా నష్టపోయేదీ ఉండదు. అది మన జీవితంలోని అత్యుత్తమమైన తప్పే అవుతుంది. ఏ మనీ గురువులూ బోధించని విలువైన పాఠాన్ని నేర్పుతుంది ఆ అనుభవం. నిర్లిప్తతతోనో, బద్ధకంకొద్దో మైక్రో ఇన్వెస్ట్ట్‌మెంట్‌ నిర్ణయాన్ని వాయిదా వేసినంత కాలం... చిల్లర శ్రీమహాలక్ష్మి మన గడప బయటే నిలబడుతుంది. పిల్లలకు పాఠాలు ‘భారతీయులు పేదలుగా పుట్టి... సంపన్నులుగా మారి... నిరుపేదలుగా మరణిస్తారు’ అని ఎగతాళి చేస్తుంటారు ఆర్థికవేత్తలు. కారణం, నిరుపేద కుటుంబంలో జన్మించినా... కష్టపడి కోట్లకు కోట్లు సంపాదించినా... ఆ సొమ్మును కనీస అవసరాలకూ ఖర్చు చేసుకోరు. ఆస్తి పాస్తులన్నీ వారసులకు కట్టబెట్టాలనే అర్థంలేని ఆరాటమే అందుకు కారణం. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు సైకిల్‌ నేర్పుతాం. ఈత నేర్పుతాం. సంగీతం నేర్పుతాం. కోడింగ్‌ కూడా నేర్పుతాం. కానీ, ఏ దశలోనూ సంపాదన గురించి బోధించం. మనిషికి అత్యవసరమైన జీవన కళ ఇది.  పైసాపైసా కూడబెట్టి కోట్లకొద్దీ సంపదను బంగారు పళ్లెంలో అందించినా... పిల్లలకు బొత్తిగా ఆర్థిక విద్య తెలియకపోతే, ఆ కొండల్ని మన కళ్లముందే కరిగించేస్తారు. మనం భారీగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ఆర్థిక అక్షరాలు నేర్పగలిగితే, డబ్బు విలువ తెలియజెప్పగలిగితే... వాళ్లే సంపాదించు కుంటారు. సంపాదించింది నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకున్నది పదింతలు చేసుకుంటారు. ఎదుగుతున్న దశలో పిల్లలతో ఆర్థిక అక్షరాభ్యాసం చేయించడానికి మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ అత్యుత్తమ మార్గం. ‘నీ పాకెట్‌ మనీ నీ ఇష్టం. కానీ, ఖర్చుచేయగా మిగిలిన చిల్లర పైసల్ని మాత్రం జాగ్రత్తగా మదుపు చేయాలి!’ అని షరతు పెడితే కాదంటారా? ఉత్సాహంగా ముందుకొస్తారు. పది ఇరవైగా, యాభై వందగా డబ్బే డబ్బును పొదుగుతున్న తీరును చూసి మురిసిపోతారు. అంతేనా, వాళ్లకు స్టాక్‌ మార్కెట్‌ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుంది. ఎందుకు పాతాళానికి పడిపోతుందో, ఎందుకు పైపైకి దూసుకుపోతుందో కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. ఆమాత్రం అవగాహన చాలు. జీవితంలో స్థిరపడ్డాక తొలి సంపాదన నుంచే మదుపు ప్రయాణం ప్రారంభిస్తారు.   పెద్దలకూ పనికొస్తుంది వయసు పెరిగేకొద్దీ డబ్బు అవసరమూ పెరుగుతుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులు కూడా నిరభ్యంతరంగా మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. మెడికల్‌ షాపులో ఏ మందులో కొన్నప్పుడు తిరిగిచ్చే చిల్లర పైసలనూ, నెలాఖరుకు పెన్షన్‌ ఖాతాలో మిగిలే అడుగుబొడుగు నోట్లనూ పెట్టుబడిగా మార్చుకోవచ్చు. సంపాదనాపరులు సైతం మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను అదనపు మదుపు మార్గంగా భావించవచ్చు. రోజూ సాయంత్రం ఇంటికెళ్లాక పర్సులోంచి ఓ పది రూపాయలు తీసి పక్కన పెట్టినా... అందులో ఆదివారాలు మినహాయించినా... నెలకు రెండొందల యాభై రూపాయలు అవుతుంది. పాతికేళ్లకు ఆ సొమ్ము డెబ్భై అయిదు వేలకు చేరుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏ సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలోనో స్టాక్‌ మార్కెట్‌కు మళ్లిస్తే... దీర్ఘకాలంలో సాలీనా పద్నాలుగు శాతం రాబడితో దాదాపు రూ.ఆరు లక్షలు సమకూరుతుంది. రిటైర్మెంట్‌ ఫండ్‌కు ఇది అదనపు జోడింపు. అనుకోని ఖర్చుల్ని అధిగమించడానికి కూడా పనికొస్తుంది. దేశ జనాభాలో ఐదుశాతం మందే స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, తొంభై అయిదుశాతం ప్రజలు ఓ దీర్ఘకాలిక మదుపు మార్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను జనంలోకి తీసుకెళ్లగలిగితే... మదుపర్ల సంఖ్యా పెరుగుతుంది.   షరా: ఏ పెట్టుబడిలో అయినా రిస్క్‌ ఉంటుంది. మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌కూ ఈ మాట వర్తిస్తుంది. *** పంచుకునే మనసు ఉంటుంది. పంచుకోడానికి డబ్బు ఉండదు. వికలాంగుల కోసమో, అనాథల కోసమో నిజాయతీగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలని చాలాసార్లు అనుకుంటాం. కానీ, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా ఏ నెలకు ఆ నెల నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాం. అలా అని, పూర్తిగా వెనక్కి తగ్గడానికేమో అంతరాత్మ అంగీకరించదు. ఇలాంటి సందర్భాల్లో మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ను సామాజిక బాధ్యతలకు ఓ వేదికగా ఎంచుకోవచ్చు. రెండేళ్లు తిరిగేసరికి మంచి మొత్తమే సమకూరుతుంది. ఆ డబ్బు ఓ  పేద విద్యార్థి పాఠ్య పుస్తకాలకు పనికిరావచ్చు. ఓ వృద్ధుడి నేత్ర చికిత్సకు సరిపోవచ్చు. ఓ వికలాంగుడి వీల్‌ చెయిర్‌కు ఉపయోగ పడొచ్చు. అవును, చిన్న మొత్తాలతో పెద్ద సంతృప్తీ సాధ్యమే. ‘చిల్లర’ మదుపు ఇలా... అనేక అంకుర సంస్థలు మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ సేవలు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల విశ్వసనీయత, గత చరిత్ర, తాజా ఆర్థిక ఫలితాలు, సర్వీస్‌ చార్జీల ఆధారంగా ఓ మంచి వేదికను ఎంచుకోవాలి. తర్వాత, ఆ కంపెనీ మైక్రో ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రాథమిక వివరాలతో లాగిన్‌ కావాలి. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) కాలమ్‌లో వివరాలు నింపాలి. కొన్ని సంస్థలు రూ. యాభైవేల లోపు వార్షిక పెట్టుబడులకు కేవైసీ అడగటం లేదు కూడా. ఐచ్ఛికాల్లోకి వెళ్లి స్టాక్‌ మార్కెట్‌, బంగారం... ఇలా నచ్చిన పెట్టుబడి మార్గానికి టిక్‌ పెట్టొచ్చు. షాపింగ్‌లో మిగిలే చిల్లర పైసలు, బ్యాంకు ఖాతా నుంచి రోజువారీ లేదా నెలవారీ చెల్లింపులు... ఇలా మనం నిధులు సమకూర్చే విధానాన్నీ స్పష్టం చేయాలి. అవసరమైతే మన బ్యాంకు ఖాతాతో ఆ చెల్లింపుల్ని అనుసంధానించాలి. ఆ తర్వాత కూడా, ప్రతి రూపాయీ మన ఖాతాలో జమ అవుతున్నదీ లేనిదీ గమనించుకుంటూ ఉండాలి.  ఫండ్‌ హౌస్‌ పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలి. రాబడి ఏమంత సంతృప్తికరంగా లేకపోతే, ప్రత్యామ్నాయం ఆలోచించాలి. చిల్లర ఎవరికీ ఊరికే రాదు! ‘సూక్ష్మ’ సూక్తులు! సంపాదించడం కళే. కానీ, సంపాదించింది నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద కళ. మొదట సంపాదిస్తూ ఆనందించాలి, ఆ తర్వాత పొదుపు చేస్తూ ఆనందించాలి, చివరగా ఖర్చు చేస్తూ ఆనందించాలి. సంపద సృష్టికి రెండే మార్గాలు. ఒకటి.. ఇంకొంత సంపాదించడం లేదా ఇంకొంత పొదుపు చేయడం. నీ ఆర్థిక స్థితిని నీ సంపాదన నిర్ణయించదు, నీ ఖర్చులు నిర్ధారిస్తాయి. పొదుపు అనేది అంకెలకు సంబంధించిన వ్యవహారం కాదు, నిబద్ధతతో ముడిపడిన విషయం. సంపన్నుడిలా కనిపించాలని ఆరాటపడినంత కాలం, నువ్వు పేదగానే మిగిలిపోతావు. మనం కాపాడుకున్న సొమ్మే కష్టకాలంలో మనల్ని కాపాడుతుంది. పొదుపు మహా సులభమైన పని... మన కోసం మన అమ్మానాన్నలు చేసిపెట్టినప్పుడు!

  • అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్ New AI Tool reveals where did you go

    గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో OpenAI చాట్ జీపీటీ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటు గూగుల్, యాపిల్‌తో సహా కీలక కంపెనీలు కూడా తమ AI చాట్‌బాట్‌లను ప్రకటించాయి. దీంతో ఇవి ఏ ప్రశ్న అడిగినా కూడా నిమిషాల్లోనే పనిని పూర్తి చేయగలవు. అయితే ఇటీవల స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందర్నీ ఆశ్చర్యపరిచే AI సాధనాన్ని రూపొందించారు. ఇది మీ చుట్టూ ఉన్న సూక్ష్మజీవులను విశ్లేషించగలదు. అంతేకాదు మీరు ఇటీవల సందర్శించిన ప్రదేశాలను కూడా గుర్తిస్తుంది. అంటే ఈ ఏఐ సాధనం మీ గురించి మరిన్ని వివరాలను బహిర్గతం చేస్తుంది. GPS ఉపయోగించదు జీనోమ్ బయాలజీ & ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ కొత్త పద్ధతి గురించి ప్రకటించారు. ఒక వ్యక్తి బీచ్, రైల్వే స్టేషన్ లేదా పార్క్ వంటి ప్రదేశాలను సందర్శించాడో లేదో గుర్తించగలదు. విశేషమేమిటంటే ఇందులో ఎలాంటి జీపీఎస్‌ను ఉపయోగించలేదు. కానీ ఈ సాధనం వివిధ ప్రదేశాలలో కనిపించే సూక్ష్మజీవుల "వేలిముద్ర"ను ఉపయోగిస్తుంది. ఇవి ఆ స్థలం నుంచి ప్రతి ప్రదేశానికి భిన్నంగా ఉంటాయి. ఈ కొత్త టెక్నాలజీని ఫోరెన్సిక్స్, ఎపిడెమియాలజీ వంటి రంగాలలో ఉపయోగిస్తున్నారు. ఈ AI సాధనం ఎలా పని చేస్తుంది? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఆల్గే వంటి కొన్ని సూక్ష్మజీవులు వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలో సూక్ష్మజీవుల ప్రత్యేక సమూహాలు ప్రతిచోటా కనిపిస్తాయి. వీటిని మైక్రోబయోమ్స్ అని పిలుస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తి శరీరం లేదా బట్టలపై ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా, ఆ వ్యక్తి ఇటీవల ఎక్కడికి వెళ్లాడనే విషయాలను చెబుతుంది. ఇలాంటి క్రమంలో మీరు నిన్న రాత్రి పార్కుకు వెళ్లారా లేదా బీచ్ వెళ్లారా అనే విషయాలను కూడా తెలుపుతుంది. ఈ AI సాధనం ఎలా తయారు చేయబడింది? 53 నగరాల్లోని సూక్ష్మజీవులు, 18 దేశాల నుంచి 237 మట్టి నమూనాలు, 9 వేర్వేరు నీటి వనరుల నుంచి 131 సముద్ర సూక్ష్మజీవులతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సూక్ష్మజీవుల డేటాతో దీనిని నిర్మించారు. ఈ సూక్ష్మజీవులను అధ్యయనం చేయడం ద్వారా AI వివిధ ప్రదేశాల నుంచి నిర్దిష్ట సూక్ష్మజీవుల సమూహాలను గుర్తించడం నేర్చుకుంది. పరిశోధకుడు అరోన్ ఎల్హైక్ ప్రకారం ఈ నమూనా మానవ శరీరంపై సూక్ష్మజీవుల మారుతున్న కూర్పు గురించి ప్రయోజనాన్ని పొందింది. ఈ క్రమంలో ఇది వ్యాధుల వ్యాప్తి, ఇన్ఫెక్షన్ మూలాన్ని కూడా సులభంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. ఖచ్చితత్వం ఎలా ఉందంటే.. ఈ AI టూల్ చాలా ఖచ్చితత్వంతో వివిధ స్థానాలను పదేపదే గుర్తించింది. ఇది 92% కేసులలో పట్టణ ప్రాంతాలలో ఉన్న నగరాన్ని సరిగ్గా గుర్తించింది. ఇది మాత్రమే కాదు. ఈ AI సాధనం హాంకాంగ్‌లోని 564 అడుగుల దూరంలో ఉన్న రెండు సబ్‌వే స్టేషన్‌ల మధ్య తేడాను కూడా గుర్తించగలిగింది. ఈ క్రమంలో త్వరలో కూడా ఇది అలాగే పనిచేస్తుందా లేదా అనేది చూడాలి మరి.

  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఎన్నికైన పాఠశాలలు జాబితా

    అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఎన్నికైన పాఠశాలలు జాబితా ఇది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగానే ఏపీలో భారీ స్థాయిలో అన్ని పాఠశాలల్లో తల్లితండ్రుల సమావేశాలను నిర్వహించతలపెట్టారు. దీనికి మెగా పేరెంట్స్ మీటింగ్ అని పేరు పెట్టారు. ఈ సమావేశాల్లో పాఠశాలల్లో తీసుకు వస్తున్న మార్పుల గురించి తీర్మానాలు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యాభివృద్ధి కొరకు మరియు పాఠశాల అభివృద్ధి కొరకు వివిధ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ భారీ తల్లిదండ్రుల సమావేశం కొరకు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు ఆ జాబితాను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఎన్నికైన పాఠశాలలు జాబితా

  • ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలకు సంబంధించిన సమాచారం

    ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలకు సంబంధించిన సమాచారం.. **పాఠశాల సమయాలకు సంబంధించి ప్రస్తుత ఇచ్చినటువంటి ట్రయిల్ పరిశీలన కోసం మాత్రమే. 2024 డిసెంబర్ ఒకటి నుంచి పాత టైమింగ్స్ తో మాత్రమే కొనసాగుతాయి. ** పేరెంట్ టీచర్స్ సమావేశం డిసెంబర్ 7వ తేదీన పాఠశాల స్థాయిలో జరుగుతుంది.. ** బదిలీలకు సంబంధించిన ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరి నామ్స్ GAD వారు ఇచ్చిన నామ్స్ ఆధారంగా నిర్వహిస్తారు. జీవో47. తేదీ 22 5 2023లో ఇచ్చిన ఉత్తర్వులను మరోసారి పరిశీలించి తనుగుణంగా నిబంధనలు రూపొందిస్తారు . .**ప్రాథమిక పాఠశాలలో మోడల్ ప్రైమరీ పాఠశాలలపై చర్చ జరిగింది.. అయితే గ్రామపంచాయతీ తో చర్చించి ఏ పాఠశాలల్ని మోడల్ పై మరీ పాఠశాలగా మార్చాలో తగు నిర్ణయం చేస్తామని తెలిపారు. ** ప్రమోషన్ ప్యానల్ ఇయర్ ని జూన్ 1 నుంచి మే 31 వరకు, ప్రధానోపాధ్యాయులకు గతంలో ఉన్న సెప్టెంబర్ నుంచి ఆగస్టు పేనల్ ఇయర్ గా పగిణించటంపై చర్చ జరిగింది. **ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి ప్లస్ టు పాఠశాలలు, ఇతర పాఠశాలల్లో అవసరం మేరకు పని సర్దుబాటు చేసుకోవడానికి డీఈఓ లకు తగిన అధికారాలు ఇచ్చారు. ** ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు 36 పీరియడ్స్ మించి వర్కులోడ్ లేకుండా తగు నిబంధనలను రూపొందిస్తారు. **లీడర్షిప్ ట్రైనింగు, ఎఫ్ఎల్ఎం ట్రైనింగులు సంబంధించి నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో మాత్రమే జరపాలని కోరాము. ఎస్పిడి గారి దృష్టిలో పెట్టి తప్పక తగు నిర్ణయం చేస్తామని చెప్పారు. **DEO పూల్ లో ఉన్న ఉపాధ్యాయుల కు శాశ్వత పాఠశాలలను కేటాయించాలని, అర్హత కలిగిన వారికి తక్షణం ప్రమోషన్స్ ఇవ్వాలని కోరాము. ** ఏలూరు జిల్లా కామవరపుకోట మండలాన్ని ఏలూరు రెవిన్యూ డివిజన్లోనే ఉంచాలని ప్రాతినిధ్యం చేసాము. అని ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి

  • 8 కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం: AP Legislative Assembly Approved 8 Key Bills

    ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది.  అమరావతి: ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది.  మండలిలో ఆమోదం పొందిన బిల్లులివే.. చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసనమండలి రద్దు చేసింది లోకాయుక్త సవరణ బిల్లు 2024కు శాసనమండలి ఆమోదం గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సవరణ బిల్లు 2024కు శాసన మండలి ఆమోదం ఏపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం  ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్  యాక్ట్ 2024  రద్దుకు  శాసనమండలి ఆమోదం పీడీ యాక్ట్‌ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.

  • కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఇవన్నీ ఉచితం..

    ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది. ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్‌లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

  • విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలి: మంత్రి లోకేశ్‌

    అమరావతి: వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్‌ భేటీ విద్యార్థులపై ప్రయోగాలు వద్దు.. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి: లోకేశ్‌ వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులను కోరిన మంత్రి విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలి సాంకేతికతతో విద్యావ్యవస్థలో సత్ఫలితాలకు ప్రణాళికలు రచిస్తున్నాం త్వరలోనే ఐటీ పాలసీ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ఐటీ కంపెనీలను కూడా ఏపీకి ఆహ్వానించటంలో శాసనసభ్యులు కూడా సహకరించాలి. కంపెనీలు ఏపీకి తేవటంలోనా ఒక్కడి వల్లే సాధ్యం కాదు అందరూ సహకరించాలి. ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే మా ప్రభుత్వ లక్ష్యం. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉంది. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టాం. త్వరలోనే ఐటీ పాలసీ కూడా తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అదానీతో పాటు కొన్ని కంపెనీలు విశాఖపట్నంకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. డేటా సెంటర్‌లకు సంబంధించిన ఓ జాతీయ స్థాయి ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో విశాఖలోని ఐటీ హిల్స్‌పై డేటా సెంటర్లు వస్తాయి. నిక్సీ సంస్థతో మాట్లాడుతున్నాం, సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

bottom of page